Krishna District: కృష్ణా జిల్లాలో వైసీపీ నేతల కొట్లాట.. పెడనలో 144 సెక్షన్ విధించిన పోలీసులు!
- జోగి రమేశ్, ఉప్పాల రాంప్రసాద్ గ్రూపుల ఘర్షణ
- గాయపడ్డ వైసీపీ కార్యకర్తలు
- శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్న ఎస్పీ త్రిపాఠి
కృష్ణా జిల్లా పెడనలో టెన్షన్ టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ నేతలు జోగి రమేశ్ ఉప్పాల రాంప్రసాద్ వర్గీయులు నిన్న పరస్పరం దాడి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ రోజు కూడా పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాకపోవడంతో జిల్లా ఎస్పీ త్రిపాఠి భారీగా పోలీసులను మోహరించారు. ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా పెడన ప్రాంతంలో 144 సెక్షన్ ను విధించారు.
మచిలీపట్నం పార్లమెంట్ కన్వీనర్ వల్లభనేని బాలశౌరి కార్యాలయ ప్రారంభోత్సవానికి నిన్న జోగి రమేశ్, ఉప్పాల రాంప్రసాద్ తమ అనుచరులతో కలిసి బయలుదేరారు. అయితే మార్గమధ్యంలో ఒకరినొకరు కవ్వించుకోవడంతో ఇరువర్గాలు పరస్పరం దాడికి దిగాయి. ఈ ఘటనలో రమేశ్ వాహనం ధ్వంసం కాగా, రాంప్రసాద్ వర్గీయులు పలువురు గాయపడ్డారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.