Rahul Gandhi: రాహుల్ గాంధీ దూతగా చంద్రబాబును కలిశా: అశోక్ గెహ్లాట్
- రాహుల్, చంద్రబాబుల కలయికతో మహాకూటమికి తొలి అడుగు పడింది
- భవిష్యత్ కార్యాచరణపై చంద్రబాబుతో చర్చించడానికే వచ్చా
- దేశ భవిష్యత్తు కోసమే కాంగ్రెస్, టీడీపీలు చేతులు కలిపాయి
అమరావతిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ సమావేశం ముగిసింది. అనంతరం ఇరువురు నేతలు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా గెహ్లాట్ మాట్లాడుతూ, రాహుల్ గాంధీ దూతగానే తాను చంద్రబాబును కలిశానని చెప్పారు. చంద్రబాబు, రాహుల్ గాంధీల కలయికతో మహాకూటమికి తొలి అడుగు పడిందని అన్నారు. ఢిల్లీలో ఇద్దరు నేతలు చర్చలు జరిపారని... భవిష్యత్ కార్యాచరణపై చంద్రబాబుతో చర్చించడానికే తాను ఇక్కడకు వచ్చానని చెప్పారు. మహాకూటమి సభలపై కూడా చర్చించామని తెలిపారు.
దేశ భవిష్యత్తు కోసమే టీడీపీతో కాంగ్రెస్ చేతులు కలిపిందని గెహ్లాట్ తెలిపారు. దేశం అభివృద్ధి చెందాలంటే మతతత్వ శక్తులను తరిమేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. 2019లో బీజేపీని ఓడించేందుకే... బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ మహాకూటమిగా ఏర్పడుతున్నాయని అన్నారు.