Congress: 'నేనెవరిని కలిశానో చూడండంటూ' ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో షేర్ చేసిన రాహుల్ గాంధీ!
- మోదీని పోలిన అభినందన్ పాఠక్‌తో రాహుల్ ఫొటో
- చత్తీస్‌గఢ్‌లో ప్రచారానికి వస్తున్నారన్న కాంగ్రెస్ చీఫ్
- గత నెలలోనే కాంగ్రెస్‌లో చేరిన పాఠక్
తానెవరిని కలిశానో చూడండంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటోను షేర్ చేశారు. ప్రధాని నరేంద్రమోదీని పోలిన అభినందన్ పాఠక్‌ను కలిసిన రాహుల్ ఆ ఫొటోను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఎన్నికలు జరగనున్న చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పార్టీకి ఆయన ప్రచారం చేస్తారని రాహుల్ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన పాఠక్ అచ్చుగుద్దినట్టు నరేంద్రమోదీలానే ఉంటారు.
గత ఎన్నికల్లో బీజేపీ తరపున ఆయన విస్తృత ప్రచారం చేశారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నేత కూడా అయిన ఆయన ఇటీవల కేంద్రం అవలంబిస్తున్న విధానాలను తూర్పారబడుతున్నారు. మేలు చేస్తుందనుకున్న పార్టీ ప్రజలకు కీడు చేస్తోందని ఇటీవల పేర్కొన్న ఆయన ఎన్నికల్లో బీజేపీకి, నరేంద్రమోదీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని చెప్పుకొచ్చారు. అందులో భాగంగా గత నెలలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడాయనతో కలిసి చత్తీస్‌గఢ్‌లో ప్రచారం చేయబోతోంది.