Jagan: నా కోడలిపైనా కుట్ర చేస్తున్నారు: విజయమ్మ
- 9 ఏళ్ల నాటి ఆరోపణల్లో భారతి పేరా?
- ఈడీ దర్యాఫ్తులో చేర్చాలని కుతంత్రాలు
- మీడియా ముందు వైఎస్ విజయమ్మ
నాడు వైఎస్ మరణానంతరం కాంగ్రెస్ అధినాయకత్వం నిరంకుశత్వ ధోరణిని ప్రదర్శిస్తే, నేడు అదే పార్టీతో పొత్తు పెట్టుకుని తెలుగుదేశం పార్టీ వికృత చేష్టలకు పాల్పడుతోందని వైకాపా గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ మండిపడ్డారు. అందరూ కలసి జగన్ ను ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలని, సీబీఐ, ఐటీ, ఈడీలను ఉసిగొల్పి తప్పుడు కేసులు పెట్టించారని ఆరోపించారు. 16 నెలలు తన బిడ్డను జైల్లో పెట్టారని, ఇండియాలో ఏ నాయకునిపై జరగని విధంగా జగన్ ను వేధించారని విజయమ్మ నిప్పులు చెరిగారు.
9 సంవత్సరాల తరువాత, తన కోడలు భారతిని ఈడీ దర్యాఫ్తులో చేర్చాలని కుట్రలు సాగించారని ఆమె ఆరోపించారు. 2009లో జరిగిన కేటాయింపుల్లో భారతి ప్రమేయం ఏంటని ప్రశ్నించారు. తమ అడుగులకు మడుగులు వత్తే అధికారులను అడ్డం పెట్టుకుని ఈ కుతంత్రాలను సాగిస్తున్నారని విజయమ్మ వ్యాఖ్యానించారు. ఇన్ని జరుగుతున్నా చెక్కు చెదరకుండా, భయపడకుండా జగన్, ప్రజల కోసం ప్రజల మధ్య తిరుగుతూ, వారి మంచి కోసం పోరాడుతున్నాడని చెప్పారు. ఎవరికీ తలవంచకుండా జగన్ సాగుతున్నాడని, ప్రజల నుంచి జగన్ ను ఎవరూ దూరం చేయలేరని అన్నారు.