Guntur District: జగన్ పై దాడి ఘటనలో ఏపీ డీజీపీ ఆ మాటంటే సిగ్గేసింది: మాజీ డీఐజీ ఏసురత్నం!
- అధికారం ఎల్లప్పుడూ ఒకరిదే కాదు
- జగన్ పై హత్యాయత్నం కేసులో 120 డీ సెక్షన్ ఎక్కడ?
- రిటైర్డ్ డీఐజీ చంద్రగిరి ఏసురత్నం
వైఎస్ జగన్ పై ఎయిర్ పోర్టులో హత్యాయత్నం తరువాత, గంట వ్యవధిలోనే ఏపీ డీజీపీ ఠాకూర్ మీడియా ముందుకు వచ్చి చెప్పిన మాటలు విని, ఓ పోలీసు అధికారిగా తాను సిగ్గుపడ్డానని రిటైర్డ్ డీఐజీ చంద్రగిరి ఏసురత్నం వ్యాఖ్యానించారు. ఈ ఉదయం గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన, ఎల్లప్పుడూ అధికారంలో ఉండేది ఒకరేనని భావించరాదని, ఓడలు బళ్లవుతాయని అన్నారు.
జగన్ పై దాడి కేసులో కేవలం 307 సెక్షన్ మాత్రమే పెట్టారని గుర్తు చేసిన ఆయన, కుట్ర కోణాన్ని సూచించే 120 డీ ఎందుకు పెట్టలేదని అన్నారు. గతంలో తాను టీడీపీ తరఫున పోటీ చేయాలని భావించి, పెద్దలను సంప్రదిస్తే డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపించిన ఆయన, జగన్ తో కేవలం మూడు నిమిషాలు మాట్లాడగానే, తనకు టికెట్ హామీ లభించిందన్నారు. రాష్ట్రంలో రెడ్లు, ఎస్సీ, ముస్లిం ఓట్లను ఓ పథకం ప్రకారం తొలగిస్తున్నారని ఏసురత్నం ఆరోపించారు. గుంటూరు వెస్ట్ లో 42 వేల ఓట్లను తొలగించారని ఆయన అన్నారు.