gaja saiclone: ముంచుకు వస్తున్న ‘గజ’ తుపాను ముప్పు ... అప్రమత్తమైన నెల్లూరు జిల్లా యంత్రాంగం
- తీరంలోని ప్రతి మండలానికో ప్రత్యేక అధికారి నియామకం
- ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలింపు ఏర్పాట్లు
- కృష్ణపట్నం పోర్టులో 2వ నంబరు ప్రమాద హెచ్చరిక జారీ
నెల్లూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుపాను ('గజ'గా నామకరణం చేశారు)గా మారి తీరం వైపు దూసుకు వస్తుండడంతో అలర్టయ్యారు. ఈనెల 15వ తేదీన కడలూరు, నాగపట్నం మధ్య గజ తుపాను తీరం దాటే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
కృష్ణపట్నం రేవులో రెండో నంబరు ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు. దీంతో ముప్పు ముంచుకు వస్తోందని అంచనా వేస్తున్నఅధికారులు అవసరమైన ముందస్తు చర్యలు చేపడుతున్నారు. తుపాను ప్రభావం అత్యధికంగా ఉండే తీరంలోని మండలాలకు ఇప్పటికే ప్రత్యేక అధికారులను నియమించారు. అవసరమైతే ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులను హెచ్చరించారు. కాగా తుపాన్ నేపథ్యంలో బుధవారం సాయంత్రం నుంచి దక్షిణ కోస్తాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.