Narendra Modi: మోదీ దుష్టపాలనకు చరమగీతం పాడాలి : కాంగ్రెస్ పార్టీ ప్రచారకర్త, నటి ఖుష్బూ
- వ్యవస్థలన్నీ తిరోగమనంతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ
- నోట్ల రద్దుతో చిరు వ్యాపారులకు తీవ్ర నష్టం
- రాహుల్ ప్రధాని కావాలన్నది కాంగ్రెస్ వాదుల ఆకాంక్ష
అనాలోచిత నిర్ణయాలతో అన్ని వ్యవస్థలను గాడి తప్పించిన కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి చరమ గీతం పాడాల్సి ఉందని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రచార కర్త, సినీ నటి ఖుష్బూ పిలుపునిచ్చారు. మోదీని గద్దె దించడమే లక్ష్యంగా అన్ని పార్టీలు ఒకే తాటిపైకి వస్తున్నాయని చెప్పారు. వ్యవస్థలన్నీ తిరోగమనంలో ఉన్నాయని, దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణించిందన్నారు. పెద్ద నోట్ల రద్దు వంటి నిర్ణయాలతో చిరు వ్యాపారులు, సాధారణ ప్రజలు బాధింపునకు గురయ్యారని గుర్తు చేశారు.
మోదీ సర్వాధికారిలా వ్యవహరిస్తున్నారని సాక్షాత్తు ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాంరాజన్ చేసిన వ్యాఖ్యలు పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నాయని ధ్వజమెత్తారు. ఈ పరిస్థితుల్లో మోదీని గద్దె దించడం కూటమి ప్రధాన లక్ష్యమని, ఆ తర్వాత ప్రధాని ఎవరన్నది నిర్ణయిస్తారన్నారు.
రాహుల్ ప్రధాని కావాలన్నది కాంగ్రెస్ వాదుల బలమైన ఆకాంక్ష అని, ఈ విషయాన్ని నాయకులంతా కలిసి నిర్ణయిస్తారని చెప్పారు. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాహుల్‌గాంధీ ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నారని, ఎన్నికలు పూర్తయ్యాక తమిళనాడు రాష్ట్రంపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తారని తెలిపారు.