kunamaneni: మహాకూటమిలో మేము కొనసాగడంపై ఫిఫ్టీ-ఫిఫ్టీ ఛాన్స్ ఉంది: సీపీఐ నేత కూనంనేని
- మేము 5 సీట్లు అడుగుతుంటే..3 ఇస్తామంటున్నారు
- కాంగ్రెస్ పార్టీ తమ సీట్లెన్నో ముందు తేల్చుకోవాలి
- అతి విశ్వాసంతో ఆకాశమే హద్దుగా కాంగ్రెస్ భావిస్తోంది
మహాకూటమిలో తాము కొనసాగడంపై ఫిఫ్టీ-ఫిఫ్టీ ఛాన్స్ ఉందని సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు అభిప్రాయపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తాము కాంగ్రెస్ పార్టీతో చర్చించడానికి ఢిల్లీకి రాలేదని స్పష్టం చేశారు. కూటమిలో తాము ఉన్నామనో, బయటకు వచ్చామనో చెప్పడం లేదని అన్నారు. తమకు 5 సీట్లు అడుగుతున్నామని, కాంగ్రెస్ 3 సీట్లు ఇస్తామంటోందని, అసలు, కాంగ్రెస్ పార్టీ తమ సీట్లెన్నో ముందు తేల్చుకోవాలని సూచించారు.
టీ-కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాపై రాహుల్ గాంధీ కూడా అసహనం వ్యక్తం చేశారని, కాంగ్రెస్ పార్టీ అతి విశ్వాసంతో ఆకాశమే హద్దుగా భావిస్తోందని విమర్శలు గుప్పించారు. వైరా, బెల్లంపల్లి, హుస్నాబాద్ నియోజకవర్గాలను తమకు ఇస్తామన్నారని, మునుగోడు లేదా ఆలేరు, దేవరకొండ నియోజకవర్గాలు కూడా కావాలని తాము కోరామని చెప్పారు. ఒక్కో సెగ్మెంట్ కు ఒక్కో కథ చెబుతున్నారని, టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి కుంతియా లోతైన ఆలోచన చేసి ఉంటే బాగుండేదని, లేకపోతే వారు నష్టపోయే అవకాశం ఉందని అనుకుంటున్నామని అన్నారు. మహాకూటమి చెడిపోవాలని తాము కోరుకోవడం లేదని, తమను కూటమిలో కొనసాగించాలా? లేదా? అన్న విషయం కాంగ్రెస్ పార్టీ చేతిలోనే ఉందని స్పష్టం చేశారు.