Bihar: ఎన్డీయేకు హ్యాండివ్వనున్న మరో పార్టీ!
- బీహార్ లో 6 సీట్లు కోరుతున్న ఆర్ఎస్ఎల్పీ
- రెండుకన్నా ఎక్కువ ఇచ్చేది లేదంటున్న జేడీయూ
- బీజేపీతో చెలిమికి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉపేంద్ర కుశ్వాహా
బీహార్ లో లోక్ సభ సీట్ల సర్దుబాటు వ్యవహారం బీజేపీకి కొత్త తలనొప్పులు తెచ్చి పెడుతోంది. 2014లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీయేలో భాగంగా ఉన్న రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్ఎస్ఎల్పీ) మూడు సీట్లలో పోటీ చేయగా మూడింటిలోనూ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఇక, వచ్చే సంవత్సరం జరిగే ఎన్నికల్లో తమకు కనీసం 6 సీట్లను కేటాయించాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తుండగా, రెండు కన్నా ఎక్కువ ఇచ్చే పరిస్థితి లేదని జేడీయూ స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆర్ఎస్ఎల్పీ అధినేత ఉపేంద్ర కుశ్వాహా, ఎన్డీయే నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
సోమవారం నాడు ఢిల్లీకి వచ్చిన ఉపేంద్ర కుశ్వాహా, ఎల్జేడీ అధినేత శరద్ యాదవ్ తో మంతనాలు జరిపారు. దీంతో ఆయన బీజేపీతో చెలిమికి గుడ్ బై చెప్పనున్నారన్న వార్తలు గుప్పుమన్నాయి. ఈ విషయంలో ఉపేంద్ర కుశ్వాహా అధికారికంగా స్పందించాల్సి వుంది.