IMD: దిశ మార్చుకుని రామేశ్వరం వైపు 'గజ' తుపాను!
- కాస్తంత బలహీనపడ్డ తుపాను
- రేపు కడలూరు, పంబన్ మధ్య తీరం దాటే అవకాశం
- పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ
బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను 'గజ' తన దిశను మార్చుకుంది. ప్రస్తుతం కాస్తంత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా ఉన్న 'గజ' దిశను మార్చుకుని, రామేశ్వరం వైపు కదులుతోంది. దిశ మారడంతో ఇది మరింతగా బలహీనపడుతుందని, కడలూరు, పంబన్ మధ్య రేపు తీరం దాటే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
దీని ప్రభావంతో రేపటి నుంచి రెండు మూడు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. తీర ప్రాంతంలోని వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపారు.