nara lokesh: ప్రధాని ఎవరో నిర్ణయించేది చంద్రబాబే.. బీజేపీని కేసీఆర్ ఒక్క మాట కూడా అనట్లేదు: దుబాయ్ లో నారా లోకేష్

  • ఏపీలో అన్ని పార్లమెంటు స్థానాలను టీడీపీ గెలవబోతోంది
  • ఇరు తెలుగు రాష్ట్రాలకు బీజేపీ అన్యాయం చేసింది
  • పెద్ద పెద్ద కంపెనీలు ఏపీకి క్యూ కడుతున్నాయి

రానున్న ఎన్నికల్లో ఏపీలోని అన్ని పార్లమెంటు స్థానాలను టీడీపీ గెలవబోతోందని మంత్రి నారా లోకేష్ జోస్యం చెప్పారు. దేశ ప్రధాని ఎవరు కావాలనేదాన్ని నిర్ణయించబోయేది ముఖ్యమంత్రి చంద్రబాబేనని అన్నారు. దుబాయ్ లో ఎన్నారై టీడీపీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యానించారు.

తెలంగాణ ఎవరి హయాంలో అభివృద్ధి చెందిందో ఆ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని ఈ సందర్భంగా లోకేష్ అన్నారు. విభజన సమయంలో తెలంగాణకు కూడా అనేక హామీలు ఇచ్చారని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని, అయినా కేంద్రాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క మాట కూడా అనడం లేదని విమర్శించారు. తెలుగువారంతా కలసికట్టుగా అభివృద్ధి చెందాలనేదే టీడీపీ ఆశయమని చెప్పారు. తెలుగు రాష్ట్రాలకు బీజేపీ తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు. రాష్ట్రాలు బలంగా ఉంటేనే... దేశం బలంగా ఉంటుందని చెప్పారు.

ఏపీలో నీటి సమస్య లేకుండా చేశామని లోకేష్ తెలిపారు. పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఏపీకి క్యూ కడుతున్నాయని చెప్పారు. కియా, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, హెచ్సీఎల్, జోహోలాంటి ప్రముఖ కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయని తెలిపారు. 2019 నాటికి లక్ష ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఎన్నారైలు ఏపీలో జరుగుతున్న అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారి, ప్రచారం చేయాలని కోరారు. నవ్యాంధ్ర అభివృద్ధిని బలహీనపరిచేందుకు, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేందుకు కొన్ని రాజకీయ దుష్ట శక్తులు కుట్ర పన్నాయని.... వాటిని అడ్డుకునేందుకు అందరూ టీడీపీకి మద్దతు పలకాలని విన్నవించారు. 

  • Loading...

More Telugu News