KCR: నేను ఏ స్థాయికి వెళ్లినా నా మూలాలు సిద్ధిపేటలోనే!: తెలంగాణ సీఎం కేసీఆర్
- ఆ విషయాన్ని మర్చిపోను
- విద్యుత్ కష్టాల నుంచి బయటపడ్డాం
- హరీశ్‌రావును లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలి
తాను ఏ స్థాయిలో ఉన్నా సిద్ధిపేటలోని తన మూలాలను మర్చిపోనని తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న తెరాస అభ్యర్థి హరీశ్ రావును లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తన ఇష్టదైవం కోనాయిపల్లి వెంకన్నను దర్శించుకున్న అనంతరం కేసీఆర్ స్థానిక ప్రజలనుద్దేశించి మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపే పనిలో ఉన్నానన్నారు. ఈ నాలుగేళ్లలో రాష్ట్రంలో విద్యుత్ కష్టాలు తీరాయని, రైతులకు సరిపడేంత విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్పారు. అభివృద్ధి లక్ష్యంతో పనిచేస్తున్న టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలని, హరీశ్‌ను ఆశీర్వదించాలని కోరారు. 2004లో కేసీఆర్ సిద్ధిపేట నుంచి పోటీ చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నికల్లో హరీశ్‌రావు గెలుపొందారు. ఆ తర్వాత నుంచి అక్కడ హరీశ్ రావే పోటీ చేస్తున్నారు.