Telugudesam: వైసీపీ నేతలు ఏ ఆధారంతో నాపై ఆరోపణలు చేశారు?: ఏపీ మంత్రి ఆదినారాయణరెడ్డి
- రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడం తగదు
- ఈ విషయమై న్యాయపోరాటం చేస్తాం
- ఏపీలో వైసీపీ దుకాణం మూసుకోక తప్పదు
జగన్ పై దాడి కేసులో తన పాత్ర ఉందని రాష్ట్రపతికి వైసీపీ నేతలు ఫిర్యాదు చేయడంపై ఏపీ మంత్రి ఆదినారాయణరెడ్డి మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏ ఆధారంతో తనపై ఆరోపణలు చేశారని ప్రశ్నించారు. వైఎస్ వివేకానందరెడ్డిని ఓడించానని తనపై కక్ష గట్టారని, జగన్ పై విమర్శలు చేస్తున్నందుకే తనపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారని, ఈ విషయమై న్యాయపోరాటం చేస్తానని అన్నారు. జగన్ కు సీఎం పదవిపై ఉన్న ఆసక్తి, ఇక దేనిపైనా కనిపించట్లేదని విమర్శించారు. తెలంగాణలో వైసీపీ దుకాణం మూసుకున్నట్టే ఏపీలోనూ మూసుకోక తప్పదని జోస్యం చెప్పారు.
కోడికత్తి డ్రామా పండకపోవడం వల్లే జగన్ కొత్త నాటకం మొదలు పెట్టారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా అన్యాయం చేస్తున్న ప్రధాని మోదీని జగన్ విమర్శించడం లేదని, వాళ్లిద్దరూ ఒకే తానులో ముక్కలని వ్యాఖ్యానించారు. తెలంగాణలో మాదిరిగానే 2019కి ముందే ఏపీలో వైసీపీ దుకాణం మూసుకోవాల్సి వస్తుందని విమర్శించారు.