Hyderabad: భర్త నిలదీయడంతో స్నేహితుడిని దూరం పెట్టిన యువతి... ఇంటికొచ్చి దాడి చేసిన స్నేహితుడు!
- ఆరేళ్లుగా యువకుడితో వివాహిత స్నేహం
- పద్ధతి మార్చుకోవాలని భర్త హెచ్చరిక
- మారిన వివాహితపై దాడికి దిగిన స్నేహితుడు
తనతో స్నేహం కొనసాగించడం లేదన్న అక్కసుతో ఓ వివాహిత యువతిపై దాడి చేశాడో యువకుడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, హైదరాబాద్, బంజారాహిల్స్ ప్రాంతంలోని ఫిల్మ్ నగర్ లో నివాసం ఉంటున్న వివాహిత (25), గత ఆరేళ్లుగా అదే ప్రాంతంలోని రామకృష్ణ (27)తో స్నేహంగా ఉండేది. వీరిద్దరూ తరచూ ఫోన్ చేసుకుని, కలుస్తూ ఉండేవారు.
అయితే, రెండు నెలల క్రితం ఈ విషయం ఆమె భర్తకు తెలియడంతో, నిలదీసి పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించాడు. దీంతో ఆ యువతి తన స్నేహితుడిని దూరం పెట్టింది. ఈ నేపధ్యంలో ఆమె ఇంటికి వచ్చిన రామకృష్ణ, తనను ఎందుకు కలవడం లేదంటూ దాడికి దిగాడు. ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చాడు. ఈ విషయంలో దర్యాఫ్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.