Karnataka: విజయనగర రాజుల రాజధానికి పంచాయతీ అధ్యక్షురాలిగా ఫ్రెంచ్ సంతతి మహిళ!
- భారతదేశ పర్యటనకు వచ్చి అనెగుందిలో స్థిరపడిన ఫ్రెంచ్ మహిళ
- ఇక్కడి ఆచార వ్యవహారాలకు మైమరిచిన ప్రాన్స్ వా
- గ్రామాధ్యక్షురాలిగా ఇప్పుడామె కుమార్తె ఎన్నిక
భారతీయ సనాతన ధర్మాలు, సంస్కృతీసంప్రదాయాలకు ముగ్ధురాలైన ఫ్రాన్స్‌కు చెందిన ప్రాన్స్‌వా 1965లో దేశ పర్యటనకు వచ్చారు. కర్ణాటకలోని హంపీని సందర్శించిన ఆమెకు అక్కడి నుంచి కదలబుద్ధి కాలేదు. అక్కడి ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలకు ముచ్చటపడిన ఆమె అక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. తన పేరును శారదమ్మగా మార్చుకుని విజయనగర రాజుల తొలి రాజధానిగా గుర్తింపు పొందిన అనెగుందిలో స్థిరపడ్డారు. తర్వాత శాంతమూర్తి అనే వ్యక్తిని పెళ్లాడారు. వీరికి 1976లో అంజనాదేవి అనే కుమార్తె జన్మించారు.
ఇప్పుడిదంతా ఎందుకంటే.. 1976లో జన్మించిన అంజనాదేవి ఇప్పుడు అనెగుంది గ్రామ పంచాయతీ అధ్యక్షురాలిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. విజయనగర రాజుల రాజధాని అనెగుందికి ఇప్పుడు ఫ్రెంచ్ సంతతి మహిళ అయిన అంజానా దేవి పంచాయతీ అధ్యక్షురాలు కావడం విశేషమే. అంతేకాదు, ఆమె ఏకగ్రీవంగా ఎన్నిక కావడం మరో విశేషం. ఇప్పటి వరకు ఉన్న పంచాయతీ అధ్యక్షురాలు రాజీనామా చేయడంతో ఈ పదవి ఖాళీ అయింది. దీనికి అంజనాదేవి ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవమైనట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు.