cuddapah: కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ దిశగా అడుగులు...భూములు పరిశీలించిన కలెక్టర్
- స్థానిక రైతులతో మాట్లాడిన హరికిరణ్
- డిసెంబర్లో శంకుస్థాపనకు చురుకుగా ఏర్పాట్లు
- ఎం.కంబాలదిన్నె ప్రాంతంలో ఫౌండేషన్ స్టోన్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి సంబంధించి అడుగులు పడడం మొదలయ్యింది. డిసెంబర్లో ఈ కర్మాగారానికి శంకుస్థాపన చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరిశ్రమ ఏర్పాటుచేసే పరిధిలోని భూములను బుధవారం కలెక్టర్ హరికిరణ్ పరిశీలించారు.
ఎం.కంబాలదిన్నె ప్రాంతంలో శంకుస్థాపన పనులు జరుగుతాయని కలెక్టర్ చెప్పారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఎం.కంబాలదిన్నెకు ఆయన వాహనాలు చేరుకునేలా అవసరమైన రోడ్ల నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తన పర్యటనలో భాగంగా కలెక్టర్ కొండ ప్రాంతంలోని భూములను పరిశీలించి అక్కడి రైతులతో మాట్లాడారు.
ఇక్కడి కొండప్రాంతంలో చాలామంది రైతులకు డీకేటీ పట్టాలు ఇచ్చారు. ఉపాధి పనుల ద్వారా తమ భూముల చుట్టూ రైతులు ప్రహరీలు నిర్మించుకున్నారు. దీంతో భూములెందుకు సాగు చేయడం లేదని కలెక్టర్ వారిని ప్రశ్నించారు. మట్టి తరలించే ఆర్థిక స్తోమతలేక చేయలేదని, ఒకవేళ తమ భూములు తీసుకుంటే పరిహారం ఇప్పించాలని కోరారు. దీంతో ఆ ప్రాంతంలో సాగు చేయని భూమి, సాగుచేసే భూముల ధరల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.