Hyderabad: నోపార్కింగ్ లో హైదరాబాద్ ట్రాఫిక్ ఏసీపీ కారు... ఫొటోలు తీసి ట్విట్టర్ లో పెట్టిన జనాలు... జరిమానా!
- అడిషనల్ కమిషనర్ గా ఉన్న అనిల్ కుమార్
- నో పార్కింగ్ బోర్డు ముందు పార్కింగ్
- సెటైర్ల మీద సెటైర్లు వేసిన నెటిజన్లు
- రూ. 235 చలానా విధింపు
ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని నిత్యమూ తన కింది స్థాయి సిబ్బందికి చెప్పే హైదరాబాద్ అడిషనల్ కమిషనర్ (ట్రాఫిక్) అనిల్ కుమార్ కారది. ఉల్లంఘనులపై కఠినంగా వ్యవహరించే ఆయన కారుకే, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై చలానా పడింది. నో పార్కింగ్ బోర్డు పక్కనే ఆయన కారు పార్క్ అయివుండటాన్ని చూసిన పలువురు నెటిజన్లు, దాని ఫోటోలు తీసి, ట్విట్టర్ లో పెట్టడం ఆయన్ను ఇబ్బంది పెట్టింది.
మహంకాళి ట్రాఫిక్ పోలీసు స్టేషన్ ను తనిఖీ చేసేందుకు అనిల్ కుమార్ రాగా, ఆయన కారు (టీఎస్ 09 పీఏ 3330)ను డ్రైవర్ నో పార్కింగ్ కింద ఆపారు. ప్యాట్నీ నుంచి బేగంపేట వెళుతున్న కొందరు దీన్ని ఫోటోలు తీశారు. ఆపై ఇంకేముంది అడిషనల్ సీపీ తన కారును నో పార్కింగ్ లో ఆపారంటూ, డీజీపీ, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్, పోలీస్ కమిషనర్ లను ట్యాగ్ లు చేయడం మొదలైంది.
ముందు నిబంధనలను పాటించడం ప్రారంభించాలని, ఆపై ప్రజలకు నేర్పవచ్చునని సెటైర్ల మీద సెటైర్లు పడ్డాయి. దీనిపై గంట వ్యవధిలోనే స్పందించిన ఉన్నతాధికారులు, అనిల్ కుమార్ కారుకు రూ. 235 చలానా విధించారు.