North Korea: మరో కలకలం... హైటెక్ ఆయుధాన్ని పరీక్షించిన ఉత్తర కొరియా... దగ్గరుండి చూసిన కిమ్!
- విజయవంతమైన ప్రయోగం
- సైన్యం బలం మరింతగా పెరిగిందన్న అధికారులు
- వెల్లడించిన న్యూస్ ఏజన్సీ 'యోన్హాప్'
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో చర్చల తరువాత, అణ్వస్త్ర పరీక్షలను నిలిపివేసి, అణు పరీక్షా కేంద్రాన్ని ధ్వంసం చేయించిన ఉత్తర కొరియా, మరోసారి ప్రపంచ దేశాలను బెంబేలెత్తించే పని చేసింది. అత్యాధునికమైన ఓ హైటెక్ ఆయుధాన్ని ఆ దేశం పరీక్షించింది. ఈ పరీక్షను అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ స్వయంగా పరిశీలించారని ప్రభుత్వ మీడియా వెల్లడించిందని దక్షిణ కొరియా న్యూస్ ఏజన్సీ 'యోన్హాప్' శుక్రవారం నాడు ప్రకటించింది.
ఈ ఆయుధాన్ని ఉత్తర కొరియాలోని అకాడమీ ఆఫ్ నేషనల్ డిఫెన్స్ సైన్స్ లో అభివృద్ధి చేశారని తెలిపింది. కిమ్ చూస్తుండగా, దీన్ని ప్రయోగించారని, ఇది విజయవంతమైందని తెలిపింది. కాగా, ఇదో హైటెక్ ఆయుధమన్న వివరాలు మాత్రమే దీని గురించి తెలిశాయి. దీని శక్తి సామర్థ్యాలపై ఎటువంటి వివరాలూ వెల్లడి కాలేదు. దీన్ని అభివృద్ధి చేసేందుకు చాలా సమయం పట్టిందని, ఇది తమ సైన్యం బలాన్ని మరింతగా పెంచుతుందని ఉత్తర కొరియా సైనికాధికారి ఒకరు తెలిపారు.
కాగా, ఈ సంవత్సరం జూన్ లో ట్రంప్, కిమ్ ల మధ్య సమావేశం జరుగగా, ఆ తరువాత ఉత్తర కొరియా అణు పరీక్షలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం వీరిద్దరూ మరోసారి సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్న నేపథ్యంలో తాజా ఆయుధ ప్రయోగం జరగడం గమనార్హం.