renuka chowdary: కమ్మ ఓట్లు మీకు అవసరం లేదా?: రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలపై రేణుకా చౌదరి ఫైర్
- అభ్యర్థుల ఎంపికలో అవకతవకలు జరిగాయని పలువురు భావిస్తున్నారు
- ఒకే సామాజికవర్గానికి ఎక్కువ సీట్లు ఇవ్వడం శోచనీయం
- సరైన సమయంలో.. సరైన నిర్ణయం తీసుకుంటా
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికలో అవకతవకలు జరిగాయని పలువురు కార్యకర్తలు భావిస్తున్నారని ఆ పార్టీ నాయకురాలు రేణుకా చౌదరి అన్నారు. బీసీలు రాష్ట్ర బంద్ కు పిలుపు నిచ్చారని, విద్యార్థులు కూడా అసంతృప్తితో ఉన్నారని... దీనికంతా ఎవరు కారణమని ప్రశ్నించారు. కేవలం రెండు శాతం జనాభా మాత్రమే ఉన్న ఒక సామాజికవర్గానికి ఎక్కువ సీట్లు రావడం శోచనీయమని చెప్పారు. ఖమ్మం జిల్లాలో కూడా స్థానిక నేతలను సంప్రదించకుండా... వారి ఇష్టానుసారం టికెట్లు ఇచ్చారని విమర్శించారు. తాను పోటీ చేయాలనుకుంటే తనకు సీటును ఇవ్వలేమని చెప్పే సత్తా ఎవరికీ లేదని చెప్పారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలు నిరాశలో ఉన్నారని అన్నారు.
ఎన్నో రకాలుగా బలమైన కమ్మ సామాజికవర్గానికి ఏ ధైర్యంతో టికెట్ ఇవ్వలేదని రేణుక మండిపడ్డారు. టికెట్లు పొందిన ఇతర సామాజికవర్గ నేతలంతా సరైనవారు, బలమైనవారా? అని ప్రశ్నించారు. మిగిలిన కులాల వారంతా గెలిచేవారేనా? అని అడిగారు. కమ్మ ఓట్లు మీకు అవసరం లేదా? అని దుయ్యబట్టారు. ఒక సామాజికవర్గానికి ఎక్కువ సీట్లు ఇప్పించుకుని, రాజ్యాన్ని ఏలుదామనుకుంటున్నారా? అని మండిపడ్డారు.
సమసమాజం అనేది కాంగ్రెస్, రాహుల్ గాంధీల సిద్ధాంతమని... సిద్ధాంతానికి విరుద్ధంగా రాష్ట్ర నేతలు వ్యవహరించారని రేణుక విమర్శించారు. పార్టీ ప్రతిష్టను దిగజార్చకూడదనే తాను ఆవేదనను దిగమింగుకుంటున్నానని చెప్పారు. రేపటి ఫలితాలు వ్యతిరేకంగా వస్తే... దీనికి కారణమైన నేతలంతా పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవాల్సిందేనని అన్నారు. పార్టీలో జరుగుతున్న అన్యాయాన్ని ఉపేక్షించబోనని... కార్యకర్తలతో మాట్లాడి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.