cbi: సీబీఐకి నో ఎంట్రీ.. చంద్రబాబు బాటలోనే మమతాబెనర్జీ!
- రాష్ట్రంలోకి సీబీఐ ప్రవేశాన్ని నిషేధించిన ఏపీ ప్రభుత్వం
- సీబీఐ చట్టాన్ని తాము కూడా పరిశీలిస్తున్నామన్న మమతాబెనర్జీ
- ఏపీ మాదిరే సీబీఐకి ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకునేందుకు యత్నిస్తున్నాం
రాష్ట్రంలోకి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ప్రవేశానికి అనుమతిని ఉపసంహరించుకుంటూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయాన్ని పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ కూడా అనుసరించబోతున్నారు. సీబీఐ చట్టాన్ని తాము కూడా పరిశీలిస్తున్నామని... తదుపరి చర్యలను త్వరలోనే తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు.
రాష్ట్రాల పరిధిలో కేంద్రం తప్పుడు వైఖరిని అనుసరిస్తోందని మండిపడ్డారు. అధికారాన్ని బీజేపీ దుర్వినియోగం చేస్తోందని.. సీబీఐ, ఈడీ, ఆర్బీఐలను తన చెప్పుచేతల్లో ఉంచుకోవాలని యత్నిస్తోందని దుయ్యబట్టారు. బీజేపీ కుతంత్రాల వల్ల దేశానికే ముప్పు వాటిల్లే అవకాశం ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో, ఏపీ మాదిరే తమ రాష్ట్రంలో కూడా సీబీఐకి ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకునేందుకు యత్నిస్తున్నామని చెప్పారు.