cbi: 'సీబీఐ'పై ప్రభుత్వ నిర్ణయంతో అనేక అనుమానాలొస్తున్నాయి: అంబటి రాంబాబు
- జగన్ పై దాడి కేసులో కర్త, కర్మ, క్రియ చంద్రబాబే
- అందుకే కేసు విచారణకు భయపడుతున్నారు
- సీబీఐ అంటే చంద్రబాబు వణకిపోతున్నారు
ఏపీలోకి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ప్రవేశానికి అనుమతిని ఉపసంహరించుకుంటూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు స్పందించారు. విజయవాడలోని వైసీపీ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జగన్ పై దాడి కేసులో కర్త, కర్మ, క్రియ చంద్రబాబేనని ఆరోపించారు. తప్పు చేశారు కనుకే కేసు విచారణకు భయపడుతున్నారని, సీబీఐ అంటే చంద్రబాబు వణకిపోతున్నారని అన్నారు.
సీబీఐపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అనేక అనుమానాలొస్తున్నాయని చెప్పారు. సీబీఐ దర్యాప్తును అడ్డుకోవడానికి కారణమేంటో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆపరేషన్ గరుడ గురించి అంబటి ప్రస్తావించారు. దీనిపై విచారణకు ఎందుకు ఆదేశించరని ప్రశ్నించారు. వేల కోట్లు దోచుకున్న చంద్రబాబు ఏ విచారణకైనా తాను సిద్ధమేనని చెప్పే ధైర్యం ఉందా? అని సవాల్ విసిరారు. ఎవరైనా చట్టానికి లోబడే పని చేయాల్సి ఉంటుందని, వ్యవస్థలను గౌరవించ లేని వ్యక్తి ఆ పదవిలో కొనసాగడం అవసరమా? అని అంబటి ప్రశ్నించారు.