kcr: కేసీఆర్ ను తిట్టాలంటే నేను కావాలి కానీ, టికెట్ ఇచ్చేటప్పుడు అక్కర్లేదా?: టీడీపీపై శోభారాణి ఫైర్
- చంద్రబాబుపై నమ్మకంతో పార్టీ కోసం పని చేశాం
- ఆ నమ్మకం ఈరోజుతో పోయింది
- గొంతు వినిపించే అవకాశం మాలాంటి వాళ్లకివ్వాలి
ఆలేరు నియోజకవర్గం టికెట్ తనకు దక్కకపోవడంపై టీడీపీ నాయకురాలు శోభారాణి నిప్పులు చెరిగారు. ఈరోజు విలేకరులతో ఆమె మాట్లాడుతూ, ఏ కార్యక్రమం అయినా ముందుండి చేశామని, నాడు చీప్ లిక్కర్ కు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం ద్వారా కేసీఆర్ కు చుక్కలు చూపించే పరిస్థితి తీసుకొచ్చామని అన్నారు. ఆలేరు నియోజకవర్గంలోని యాదాద్రిని జిల్లా చేయాలంటూ ఉద్యమం చేసి ఆ జిల్లాను సాధించుకున్నామని, పార్టీ తరపున ఎక్కడ ఏ పోరాటం చేసినా తన పేరు వినిపించేదని అన్నారు.
‘మీడియాలో మాట్లాడాలంటే శోభారాణి కావాలి. కేసీఆర్ ను తిట్టాలంటే శోభారాణి కావాలి. మరి, టికెట్ల విషయమప్పుడు శోభారాణి ఎందుకు గుర్తుకు రావట్లేదు? చంద్రబాబుపై నమ్మకంతో పార్టీ కోసం పని చేశాం. చంద్రబాబు మాకు న్యాయం చేస్తారన్న నమ్మకంతో ఉన్నాం. కానీ, ఆ నమ్మకం ఈ రోజుతో పోయింది. కొత్త వ్యక్తులకు పోటీ చేసే అవకాశమిస్తున్నారు కానీ, నాకు మాత్రం ఇవ్వట్లేదు. టికెట్ ఇవ్వలేకపోతే ఎందుకు ఇవ్వలేదన్న విషయం నాయకత్వం మాకు చెప్పకుండా మొహం చాటేస్తోంది’ అని మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది లక్షల మంది టీడీపీ క్యాడర్ పని చేస్తోందని, జిల్లాలకు జిల్లాలు టికెట్లు తీసుకోకుండా టీడీపీ వదిలేసిందని, కాంగ్రెస్ పార్టీ వాళ్లు తమ కుటుంబాలకు టికెట్లు పంచుకున్నారని, పార్టీ కోసం పని చేసిన తమ లాంటి వాళ్లు ఎక్కడికి పోవాలని శోభారాణి ప్రశ్నించారు.
‘ఉద్యమాలు చేయాలంటే మేము గుర్తొస్తున్నాం కానీ టికెట్లు ఇచ్చేటప్పుడు మేమెందుకు గుర్తుకు రావట్లేదు? డబ్బులున్న వాళ్లు చివరి నిమిషంలో టికెట్లు తీసుకుంటున్నారు. డబ్బే ప్రధానమనుకుంటే మా లాంటి వాళ్లు రాజకీయాల్లో అవసరం లేదు. పార్టీలు ప్రజల కోసం పనిచేయదలచుకున్నాయా? లేక కార్పొరేట్ ఆఫీసుల్లా పని చేయదలచుకున్నాయా? ఆశయాల కోసం పనిచేస్తున్న వారిని ప్రోత్సహించాలి.. గొంతు వినిపించే అవకాశం మాలాంటి వాళ్లకు ఇవ్వాలి’ అని శోభారాణి కోరారు.