Telangana: తెలివిమీరిన సైబర్ నేరగాళ్లు.. బోనస్ పేరిట ఏకంగా పోలీస్ ఉన్నతాధికారికి రూ.14 లక్షల కుచ్చుటోపి!
- బోనస్ పేరుతో భారీ మోసం
- సైబర్ క్రైమ్ ను ఆశ్రయించిన అధికారి
- ఇన్సూరెన్స్ పాలసీ ఆధారంగా దోపిడి
ఇటీవలి కాలంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. లాటరీ వచ్చిందనీ, బ్యాంకు ఖాతాను అప్ డేట్ చేస్తున్నామని ఖాతాదారులను దోచుకుంటున్నారు. తాజాగా ఈ కేటుగాళ్లు ఏకంగా పోలీసు అధికారికే కుచ్చుటోపి పెట్టారు. ఇన్సూరెన్స్ కంపెనీ బోనస్ ప్రకటించిందంటూ బురిడీ కొట్టించి రూ.14 లక్షలు కొల్లగొట్టారు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
ఈ విషయమై సైబర్ నేరాల అదనపు డీసీపీ రఘువీర్ మాట్లాడుతూ.. ఈ ముఠా ఢిల్లీ నుంచి తమ కార్యకలాపాలను కొనసాగిస్తోందని తెలిపారు. తొలుత ఈ ముఠా ఇన్సూరెన్స్ ను చెల్లించకుండా ఆపేసిన వ్యక్తుల జాబితాను దొంగతనంగా సేకరిస్తుంది. వీరు ప్రధానంగా ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై వంటి మెట్రో వాసులను ఎంపిక చేసుకుంటున్నారు. వీరి వివరాలను పూర్తిగా అధ్యయనం చేశాక, తియ్యటి మాటలతో ఫోన్ చేస్తారు. ‘సార్.. మీ ఇన్సూరెన్స్ మొత్తంపై బోనస్ వచ్చింది. చెల్లించడానికి కొంత మొత్తం డిపాజిట్ చేయండి’ అంటూ నగదును డిపోజిట్ చేయిస్తారు. చివరికి డబ్బులు వసూలు చేసి, తమ మొబైల్ లోని సిమ్ కార్డును పారేస్తారు.
తాజాగా హైదరాబాద్ లో ఓ పోలీస్ ఉన్నతాధికారి ఇదేరకంగా మోసపోయారు. ఆయన దాదాపు రూ.45 లక్షల విలువైన బీమా పాలసీలను కట్టారు. అయితే పాలసీపై తనకు రుణం కావాలని ఇటీవల కోరగా, కంపెనీ ప్రతినిధులు నిరాకరించారు. దీంతో పాలసీని రద్దు చేసుకుంటాననీ, తన డబ్బును వెనక్కి ఇవ్వాలని సదరు అధికారి కోరారు. దీంతో పై అధికారులను సంప్రదించాలని సిబ్బంది సూచించారు. అయితే పోలీస్ అధికారి వారికి ఫోన్ చేయగా, అటువైపు నుంచి ఎవ్వరూ స్పందించలేదు.
మరుసటి రోజు అధికారికి ఫోన్ కాల్ వచ్చింది. బీమా కంపెనీ నుంచి మాట్లాడుతున్నామని పరిచయం చేసుకున్న మోసగాళ్లు.. మీ బీమాపై రూ.50 లక్షల బోనస్ వచ్చిందని ఆశపెట్టారు. ఇందుకు సంబంధించి చెక్ ను సిద్ధం చేశామనీ, దాన్ని తీసుకునేందుకు రూ.14 లక్షలు డిపాజిట్ చేయాలని సూచించారు.
ఈ మాటలను నమ్మిన బాధితుడు దశలవారీగా రూ.14.02 లక్షలు సమర్పించుకున్నాడు. అయితే నగదు చెల్లించాక ఆ ఫోన్ నంబర్ ను మోసగాళ్లు మార్చేశారు. చివరికి తాను మోసపోయినట్లు గ్రహించిన అధికారి సైబర్ క్రైమ్ విభాగాన్ని ఆశ్రయించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.