Virat Kohli: కాస్త మర్యాదగా మసలుకో.. కోహ్లీకి బీసీసీఐ వార్నింగ్
- ఇటీవల దుమారం రేపిన కోహ్లీ వ్యాఖ్యలు
- ఆస్ట్రేలియాలో నోరు జారద్దొన్న సీవోఏ
- జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరిక
ఇటీవల ఓ అభిమానిపై నోరు పారేసుకున్న కోహ్లీని బీసీసీఐ పాలకమండలి సీవోఏ మందలించింది. నోరు కాస్త అదుపులో పెట్టుకోవాలని సూచించింది. ఆస్ట్రేలియా పర్యటనలో మర్యాదగా ప్రవర్తించాలని సుతిమెత్తగా హెచ్చరించింది. అక్కడి ప్రజలతో, మీడియాతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని సీవోఏ సూచించింది. సుదీర్ఘ పర్యటన కోసం కోహ్లీ సేన ఆస్ట్రేలియా చేరుకున్న నేపథ్యంలో ఈ హెచ్చరికలు చేసింది.
ఇటీవల ఓ అభిమాని మాట్లాడుతూ కోహ్లీ ఓవర్ రేటెడ్ బ్యాట్స్మన్ అని, తనకు భారత క్రికెటర్ల కంటే ఇంగ్లండ్, ఆసీస్ క్రికెటర్లంటేనే ఇష్టమని పేర్కొన్నాడు. అతడి వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కోహ్లీ.. విదేశీ ఆటగాళ్లను ఇష్టపడేవారు దేశం విడిచి వెళ్లాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా దుమారం రేగింది. విదేశీ క్రికెటర్లను ఇష్టపడినంత మాత్రాన దేశం విడిచి వెళ్లాలని చెప్పడం సరికాదంటూ పలువురు మాజీ క్రికెటర్లు, సినీ స్టార్లు కూడా కోహ్లీని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే సీవోఏ ఈ హెచ్చరికలు జారీ చేసింది.