Pragati Bhavan: కేసీఆర్ కు నోటీసులు ఇవ్వనున్న ఎలక్షన్ కమిషన్!
- ప్రగతి భవన్ లో పార్టీ కార్యకలాపాలు
- అరవింద్ ను పార్టీలో చేర్చుకున్న కేసీఆర్
- కాంగ్రెస్ ఫిర్యాదుతో నివేదిక కోరిన రజత్ కుమార్
ఎన్నికల నియమావళికి విరుద్ధంగా, సీఎం అధికార నివాసమైన ప్రగతి భవన్ ను టీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలకు వినియోగించడంపై ఎలక్షన్ కమిషన్, సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ప్రగతి భవన్ లో టీఆర్ఎస్ లో చేరేందుకు వచ్చిన అరవింద్ రెడ్డికి పార్టీ కండువాను కప్పడం, ఎన్నికల ప్రవర్తనా నియమావళి నిబంధనల్లోని 7వ భాగం కింద విరుద్ధమైన పనేనని కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది.
టీపీసీసీ తరఫున ఎన్నికల కమిషన్ సమన్వయ కమిటీ చైర్మన్ జీ నిరంజన్, ఈ ఫిర్యాదు చస్తూ, వివిధ పత్రికల్లో వచ్చిన దృశ్యాలను జత పరిచారు. ఇదే విషయాన్ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్, నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్టు తెలుస్తోంది.
సదరు అధికారి నివేదిక ఇచ్చిన తరువాత కేసీఆర్ సమాధానాన్ని కోరుతూ నోటీసులు జారీ అవుతాయని సమాచారం. కాగా, సిద్ధిపేటలో బీజేపీ అభ్యర్థిగా ఉన్న నరోత్తమ్ రెడ్డి, కులాల ప్రస్తావన తెస్తూ, ప్రజల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేస్తున్నారని టీఆర్ఎస్ నుంచి ఈసీకి ఫిర్యాదు వెళ్లింది.