Karnataka: కర్ణాటక కాంగ్రెస్ కు కొత్త మేడమ్... ఆమె మాటలు విని మండిపడుతున్న మహిళలు!
- కేపీసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఎంపికైన పుష్పా అమర్ నాథ్
- సోమవారం నాడు బాధ్యతలు స్వీకరించనున్న నేత
- మహిళల దుస్తులపై పలు రకాల ఆంక్షలు
కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఎంపికైన పుష్పా అమర్ నాథ్, బాధ్యతలు కూడా స్వీకరించకముందే విమర్శల వర్షాన్ని కొని తెచ్చుకున్నారు. ఆమె కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా, మహిళా కార్తకర్తలు మండిపడ్డారు. ఆమె సోమవారం నాడు బాధ్యతలు స్వీకరించనుండగా, ఈ కార్యక్రమానికి వచ్చే మహిళలకు డ్రస్ కోడ్ విధించడమే ఆమె చేసిన తప్పైంది.
అందరూ చీరలు ధరించాలని, అవి కూడా నీలిరంగులోనే వుండాలని ఆదేశించిన ఆమె, మేకప్ వేసుకుని రావద్దని, లిప్ స్టిక్ వద్దని, స్కర్ట్ లు, జీన్స్ ధరించరాదని, స్లీవ్ లెస్ డ్రస్ అసలు వద్దని అన్నారు. బ్లౌజ్ కూడా మెడవరకూ ఉండాలని సూచించారు. ఆమె ఆదేశాలు మహిళల వ్యక్తిగత స్వేచ్ఛకు వ్యతిరేకంగా ఉన్నాయని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.