Andhra Pradesh: ప్రజాసంకల్ప యాత్ర మరో రికార్డు.. ప్రజల మధ్య 300 రోజులు పూర్తి చేసుకున్న జగన్!
- పార్వతీపురం కోటవానివలసలో పాదయాత్ర
- ప్రజలను కలుసుకుంటూ ముందుకెళుతున్న జగన్
- తోటపల్లి రిజర్వాయర్ వద్ద రాత్రికి బస
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర మరో రికార్డు సాధించింది. జగన్ చేపట్టిన ఈ పాదయాత్ర నేటితో 300 రోజులకు చేరుకుంది. విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలోని కోటవానివలస నుంచి ఈ రోజు ఉదయం 7.30 గంటలకు జగన్ పాదయాత్ర ప్రారంభమయింది. అక్కడి నుంచి జగన్ బంటువాణి వలస, అడ్డాపుశీల క్రాస్, బచి జంక్షన్ మీదుగా సీతాపురం క్రాస్ వరకు కొనసాగుతుంది.
ఇక్కడే జగన్ మధ్యాహ్న భోజనం తర్వాత కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం కురుపాం నియోజకవర్గంలోకి జగన్ ప్రజాసంకల్ప యాత్ర ప్రవేశించనుంది. ఉల్లిభద్ర, గురుగుబిల్లి క్రాస్, రామినాయుడు వలస మీదుగా తోటపల్లి రిజర్వాయర్ వరకు జగన్ పాదయాత్ర సాగనుంది. అక్కడే రాత్రికి జగన్ విశ్రాంతి తీసుకుంటారు.
ఏపీ ప్రతిపక్ష నేత తమ ప్రాంతానికి వస్తుండటంతో ఈ ప్రాంతానికి చెందిన ప్రజలు ఆయన్ను చూసేందుకు భారీగా గూమిగూడారు. పలువురు తమ సమస్యలను ప్రతిపక్ష నేత దృష్టికి తీసుకొచ్చారు. ‘ధైర్యంగా ఉండండి.. మన ప్రభుత్వం రాగానే తప్పకుండా న్యాయం చేస్తాం’ అని జగన్ ముందుకు సాగుతున్నారు.