21st century: 21వ శతాబ్దపు అవసరాల మేరకు దేశంలో విద్యా వ్యవస్థను పునర్నిర్మించాలి: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
- శ్రీసిటీలో క్రియా వర్శిటీ ప్రారంభం
- ఢిల్లీ నుంచి ఆన్ లైన్ లో ప్రారంభించిన ఉపరాష్ట్రపతి
- నాణ్యమైన విద్య అందించాలన్న వెంకయ్యనాయుడు
చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీలో క్రియా వర్శిటీని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఢిల్లీ నుంచి ఆన్ లైన్ లో లాంఛనంగా ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, ఉన్నత విద్యా వ్యవస్థను పునర్నిర్మించాలని పిలుపు నిచ్చారు. 21వ శతాబ్దపు అవసరాల మేరకు దేశంలో విద్యా వ్యవస్థను పునర్నిర్మించాలని, ప్రతి విద్యార్థిని ఉత్తమపౌరులుగా తీర్చి దిద్దేలా నాణ్యమైన విద్య అందించాలని, ‘క్రియా’ లాంటి విద్యా సంస్థలు అంతర్జాతీయ స్థాయిలో వేగంగా పురోగతి సాధిస్తున్నాయని అన్నారు.
ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంలో సమన్వయం అవసరమని, ప్రభుత్వం సౌకర్యాలు కల్పించే బలమైన పాత్ర పోషించాలని సూచించారు. ఆవిష్కరణలు లేకుండా అభివృద్ధిలో ముందుకు సాగలేమని, విశ్వవిద్యాలయాలు ఆవిష్కరణలకు కేంద్రాలు కావాలని ఆకాంక్షించారు. కోపం, నిరాశ, వివక్ష వంటి వాటికి విశ్వవిద్యాలయాల్లో స్థానం ఉండకూడదని, వర్శిటీలు ఙ్ఞానం, వివేకం, విఙ్ఞానాలను సంరక్షించే ప్రదేశాలుగా ఉండాలని సూచించారు.
ప్రపంచ అత్యుత్తమ వర్శిటీలతో పోలిస్తే దేశంలో ఉన్నత విద్యా వ్యవస్థ వెనుకబడి ఉందని, 2022 నాటికి దేశంలో 700 మిలియన్ల నిపుణులకు డిమాండ్ ఉండని, ఇందుకు యువత, విద్యార్థులకు ఉపాధి, నైపుణ్యాల్లో శిక్షణ అందించాలని సూచించారు. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని కోరారు.