Andhra Pradesh: అమరావతి పంటపొలాల దహనం కేసు.. చేతులు ఎత్తేసిన ఏపీ పోలీసులు!
- నిందితులను గుర్తించలేకపోయామని వెల్లడి
- కేసును మూసివేస్తున్నట్లు రైతులకు నోటీసులు
- తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు
గుంటూరు జిల్లాలోని తుళ్లూరు, తాడేపల్లి మండలాల్లోని రైతుల పంటపొలాలను 2014, డిసెంబర్ 29న గుర్తుతెలియని దుండగులు తగులబెట్టిన సంగతి తెలిసిందే. అప్పట్లోనే ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. తాజాగా ఈ వ్యవహారంలో అసలు నిందితులను గుర్తించలేకపోయామని పోలీసులు తెలిపారు. విచారణలో పురోగతి లేనందున కేసును మూసివేస్తున్నట్లు, ఈ విషయంలో ఏమైనా అభ్యంతరాలుంటే వారం రోజుల్లోపు కోర్టుకు తెలుపుకోవచ్చని పేర్కొంటూ బాధిత రైతులకు పోలీసులు నోటీసులు జారీచేశారు.
తుళ్లూరు, తాడేపల్లి ప్రాంతాల్లో 13 చోట్ల పంటపొలాలకు గుర్తుతెలియని వ్యక్తులు డిసెంబర్ 29 రాత్రి మంటపెట్టారు. విపక్ష వైసీపీనే ఈ దారుణానికి ఒడిగట్టిందని అధికార టీడీపీ ఆరోపించింది. అయితే అమరావతి ల్యాండ్ పూలింగ్ కోసం తమ భూములు ఇవ్వని రైతుల పంటపొలాలను ప్రభుత్వమే తగులబెట్టిందని వైసీపీ నేతలు ఎదురుదాడి చేశారు.
తాజాగా, ఈ ఘటన వెనుకున్న దోషులను అరెస్ట్ చేసే విషయంలో పోలీసులు చేతులు ఎత్తేయడంపై బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విచారణ పేరుతో పోలీస్ అధికారులు తమనే స్టేషన్లకు తీసుకెళ్లి వేధించారని కొందరు రైతులు వాపోయారు. వాటికి ఇప్పుడు ఏమని సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నారు.