america: అటువంటి రెడీమేడ్ దుస్తులను తయారు చేసే స్థాయికి సిరిసిల్ల ఎదగాలి : సీఎం కేసీఆర్
- యూఎస్ లో తయారయ్యే దుస్తులు ఇక్కడ కావాలి
- సిరిసిల్లలో చేనేతల ఆత్మహత్యలు ఆగాయి
- ఇంకా సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు
అమెరికా మార్కెట్ లో ఎటువంటి రెడీమేడ్ దుస్తులు అమ్ముతారో, అటువంటి దుస్తులు తయారు చేసే స్థాయికి సిరిసిల్ల ఎదగాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. సిరిసిల్లలో జరుగుతున్న ప్రజాఆశీర్వాదసభలో ఆయన మాట్లాడుతూ, సిరిసిల్లలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆగాయి కానీ, సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదని అన్నారు. భవిష్యత్ లో చేనేత కార్మికుల ఆత్మహత్యలు పునరావృతం కాకూడదని, అందుకోసం ఏదైనా చేద్దామని, ముందుకు పోదామని అన్నారు.
సిరిసిల్లలో అపారల్ పార్క్ రావాలని, ప్రతి చేనేత కార్మికుడికి ఇరవై, ముప్పై వేలు వచ్చే పరిస్థితి రావాలని అన్నారు. ప్రతి చేనేత కార్మికుడి ఇంట్లో ఉండే మహిళలు ఈ పార్కులో యజమానులు కావాలని ఆకాంక్షించారు. 'నేను ఓ కులానికో, మతానికో చెందిన వ్యక్తిని కాదు. నేను తెలంగాణ ప్రజల యొక్క పొత్తుల సద్దిని. అందరూ కూడా తినొచ్చు, అనుభవించవచ్చు. నాకెవరూ శత్రువులు లేరు’ అని కేసీఆర్ చెప్పుకొచ్చారు.