telengana: తెలంగాణ ఓటర్ల జాబితా ఖరారు చేశాం: సీఈవో రజత్ కుమార్

  • ఈ ఓటర్ల జాబితా ఆధారంగానే పోలింగ్ జరుగుతుంది
  • ఓటర్ స్లిప్పులు 23 నుంచి వచ్చే నెల 1 వరకు పంపిణీ
  • తెలంగాణ వ్యాప్తంగా 32,976 పోలింగ్ కేంద్రాలు  

తెలంగాణలో డిసెంబర్ 7న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితా ఖరారైంది. ఈ విషయాన్ని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ స్పష్టం చేశారు. ఈ ఓటర్ల జాబితా ఆధారంగానే పోలింగ్ జరుగుతుందని, ఓటర్ స్లిప్పులు ఈ నెల 23 నుంచి వచ్చే నెల ఒకటో తేదీ వరకు పంపిణీ చేస్తామని అన్నారు. బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి ఈ స్లిప్పులను పంపిణీ చేయాలని, బల్క్ గా ఓటరు స్లిప్పులు పంపిణీ చేస్తే తీవ్రంగా పరిగణిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు.

మిగిలిన ఓటర్ స్లిప్పులను ఓటింగ్ రోజు పోలింగ్ కేంద్రం వద్ద పంపిణీ చేస్తామని, స్లిప్పులపై పోలింగ్ కేంద్రం మ్యాప్, వివరాలు కూడా ఉంటాయని చెప్పారు. నామినేషన్ల దాఖలు ప్రక్రియ నిన్నటితో ముగిసిందని, మొత్తం 3583 నామినేషన్లు దాఖలయ్యాయని రజత్ కుమార్ స్పష్టం చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో రేపు కూడా నామినేషన్ పత్రాల పరిశీలన జరుగుతుందని అన్నారు.

తెలంగాణ వ్యాప్తంగా 32,976 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, 9445 సర్వీస్ ఓటర్లు ఉన్నారని వివరించారు. పోలింగ్ కోసం 1,60,509 మంది సిబ్బందిని గుర్తించామని, ఒప్పంద ఉద్యోగులకు అనుమతి ఇవ్వాలని కోరామని, రాష్ట్ర స్థాయిలో 35 వేల మంది పోలీస్ సిబ్బంది ఉన్నారని, ఇతర రాష్ట్రాల నుంచి 18 వేల మంది సిబ్బందిని సమకూర్చుకున్నామని చెప్పారు. పోలింగ్ రోజు 48 వేల మంది పోలీస్ సిబ్బంది, 279 కంపెనీల కేంద్ర బలగాలు  విధుల్లో ఉంటాయని చెప్పారు. మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లాలో పోలింగ్ సిబ్బంది కొరత ఉందని, ఉద్యోగులందరూ ఎన్నికల విధుల్లో పాల్గొనాలని ఈ సందర్భంగా ఆదేశించారు.
 
7,45,838 మంది కొత్త ఓటర్లు, 243 మంది ప్రవాస భారతీయులు తమ పేర్లను నమోదు చేసుకున్నట్టు చెప్పారు. ఐదు లక్షల ఓటర్ గుర్తింపు కార్డులను ‘మీ సేవ’కు అందించామని, నెలాఖరు వరకు కొత్త ఓటర్లందరికీ ఓటర్ గుర్తింపు కార్డులు అందజేస్తామని తెలిపారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై స్పందిస్తున్నామని, నోటీసులకు ఇచ్చే వివరణల ఆధారంగా తగు చర్యలు తీసుకుంటామని, సీవిజల్ ద్వారా 3500 ఫిర్యాదులు వచ్చాయని, ఇందులో 2220 సరైన కేసులుగా గుర్తించామని అన్నారు. తనిఖీల్లో రూ.90.72 కోట్ల నగదు, మద్యం, స్వాధీనం చేసుకున్నామని రజత్ కుమార్ తెలిపారు.

  • Loading...

More Telugu News