Chandrababu: చంద్రబాబు మాటలతో.. పాపం, దేవెగౌడకు కూడా హుషారొచ్చేసింది!: బీజేపీ నేత రామకోటయ్య సెటైర్
- చంద్రబాబు బిహేవియర్ లో విపరీతమైన మార్పు
- వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలుపు సాధ్యం కాదు
- చంద్రబాబు బొంగరంలా వెళ్లడం.. బొంకడం.
జాతీయ స్థాయిలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని చెప్పిన చంద్రబాబునాయుడి ఆలోచనా సరళి చూస్తే తనకు ఆశ్చర్యమేస్తోందని బీజేపీ నేత రామకోటయ్య విమర్శించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఏపీని అభివృద్ధి పథంలో నడిపిస్తానని, ముందుకు తీసుకెళ్తానని చెప్పిన చంద్రబాబు బిహేవియర్ లో విపరీతమైన మార్పు కనబడుతోందని విమర్శించారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లో గెలుపు సాధ్యం కాదని భావించిన చంద్రబాబు, ఏదో ఒక విధంగా రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో ఆయన అనుసరిస్తున్న విధానాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని అన్నారు.
‘సోనియా గాంధీ కుమారుడు రాహుల్ ని, దేవెగౌడ కుమారుడు కుమారస్వామిని, కరుణానిధి కుమారుడు స్టాలిన్ ని చంద్రబాబు పట్టుకున్నారు. చంద్రబాబు మెున్నీ మధ్య కర్ణాటక వెళ్లారు. ‘ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరూ లేరు. తర్వాత నిర్ణయిస్తాం’ అని చంద్రబాబు చెప్పడంతో.. మళ్లీ ఏదైనా అవకాశం వస్తే తనను ప్రధాన మంత్రిని చేస్తారేమో బాబు అని ఎనభై నాలుగేళ్ల వయసులో ఉన్న దేవెగౌడకు హుషారు వచ్చింది. అక్కడికి వెళ్లి చంద్రబాబు ఆ మాట చెప్పారు. నిన్న మమతా బెనర్జీ దగ్గరకు చంద్రబాబు వెళ్లారు.
చంద్రబాబునాయుడు గారు తీసుకున్న ‘బొంగరం’ కార్యక్రమం ఎలా ఉందంటే.. ఎక్కడికైనా బొంగరంలా చంద్రబాబు వెళ్లడం, అనవసరమైన బొంకులన్నీ బొంకడం.. దేశానికేదో అన్యాయం జరిగినట్టు!’ అని విమర్శించారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఇటీవల కలిసిన చంద్రబాబు ఆమెతో ఏం చెప్పారు! ‘ప్రధానమంత్రి అభ్యర్థిని తర్వాత నిర్ణయిస్తాం’ అని దీదీకి చెప్పారని, చంద్రబాబు ఎవరి దగ్గరకు వెళ్లి, ఏం చెప్పినా తమకొచ్చే నష్టమేమీ లేదని అన్నారు.
సమాజ్ వాదీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ, మమతా బెనర్జీని.. ఇలా చంద్రబాబు ఎవరిని కలిసినా తమకొచ్చే నష్టం, ఇబ్బందేమీ లేదని రామకోటయ్య అభిప్రాయపడ్డారు. ఎందుకంటే, భారతదేశంలో ప్రతి ఒక్కరికి చంద్రబాబునాయుడి నైజం గురించి తెలుసని, అవినీతి మయమైన ఏపీ గురించి ఆలోచించడం మానేసి, బొంగరంలా అన్ని చోట్లా తిరుగుతున్నారని చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.