jagan: జగన్, పవన్, కన్నా లక్ష్మీనారాయణ కూడా తమ ఆస్తులు ప్రకటించాలి: నారా లోకేశ్ డిమాండ్
- అన్ని పార్టీల నేతలు ఆస్తులు ప్రకటించాలి
- బాబుతో పొత్తుతో ఎలా మోసపోయారో పవన్ చెప్పాలి
- కోడికత్తి పేరిట జగన్ నాటకాలాడుతున్నారు
జగన్, పవన్, కన్నా లక్ష్మీనారాయణ కూడా తమ ఆస్తులు ప్రకటించాలని ఏపీ మంత్రి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. చంద్రబాబు కుటుంబ సభ్యుల ఆస్తులను ఈరోజు ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, అన్ని పార్టీల నేతలు ఆస్తులు ప్రకటించాలని కోరారు. చంద్రబాబుపై పవన్ కల్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. బాబుతో పొత్తు పెట్టుకుని మోసపోయానని చెబుతున్న పవన్, ఎలా మోసపోయారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడితే ఢిల్లీని వణికిస్తానన్న పవన్ ఎటు వెళ్లారు? అని ప్రశ్నించారు.
జగన్ తనపై కేసులు ఉన్నాయని భయపడుతున్నారని, మరి, పవన్ ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని అన్నారు. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాక పవన్ యూటర్న్ తీసుకున్నారని, ఏపీకి మోసం చేసిన బీజేపీ గురించి పవన్ ఒక్కమాట కూడా మాట్లాడట్లేదని విమర్శించారు. కోడికత్తి పేరుతో జగన్ నాటకాలాడుతున్నారని విమర్శించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 620 మంది టీడీపీ కార్యకర్తలను హత్య చేశారని, హత్యలు చేసే నైజం వాళ్లదని, తమకు అలాంటి చరిత్ర లేదని స్పష్టం చేశారు.
మహాకూటమి విజయం ఖాయం
తెలంగాణలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో మహాకూటమి విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ ఆదేశిస్తే కనుక కూకట్ పల్లి నుంచి పోటీ చేస్తున్న నందమూరి సుహాసిని తరపున ప్రచారానికి వెళ్తానని లోకేశ్ అన్నారు.