AgriGold: హాయ్‌ల్యాండ్ ఎండీ వెంకటేశ్వరరావు అరెస్ట్.. బుధవారం రాత్రి అదుపులోకి
- అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం ప్రక్రియను అడ్డుకునే కుట్ర
- అగ్రిగోల్డ్ కేసులో ఆయనను కూడా నిందితుడిగా చేర్చిన అధికారులు
- నేడు కోర్టులో హాజరు
అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం ప్రక్రియను అడ్డుకునేందుకు ప్రయత్నించారనే అభియోగంపై ఆర్కా లీజర్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (హాయ్‌ల్యాండ్) ఎండీ అల్లూరి వెంకటేశ్వరరావును బుధవారం రాత్రి సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. నేడు ఆయనను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం ఆయన హాయ్‌ల్యాండ్ సహా మరో 18 కంపెనీల్లో అదనపు డైరెక్టర్, డైరెక్టర్ హోదాలో కొనసాగుతున్నారు. ఇవన్నీ అగ్రిగోల్డ్‌కు సంబంధించిన డొల్ల కంపెనీలు కావడం గమనార్హం.
అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వా వెంకటరామారావుతో కలిసి అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం ప్రక్రియను అడ్డుకునేందుకు కుట్ర పన్నారని గుర్తించిన అధికారులు వెంకటేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. కాగా, అగ్రిగోల్డ్ కేసులో తాజాగా వెంకటేశ్వరరావును కూడా నిందితుడిగా చేర్చారు. ఫలితంగా అగ్రిగోల్డ్ కేసులో నిందితుల సంఖ్య 27కు చేరుకుంది.