Jammu And Kashmir: స్నేహితులవుతున్నారు... పావుగంటలో 4 మెహబూబా ట్వీట్లను రీట్వీట్ చేసిన ఒమర్ అబ్దుల్లా!
- కశ్మీరాన మారుతున్న రాజకీయం
- సుస్థిర పాలన కోసం ఒమర్ సాయం కోరిన ముఫ్తీ
- ఏకీభవిస్తానంటూ ఒమర్ సమాధానం
జమ్మూ కశ్మీర్ లో రాజకీయం శరవేగంగా మారుతున్న వేళ, తాజా మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లాల మధ్య స్నేహం పెరుగుతోంది. బీజేపీని నిలువరించడమే లక్ష్యంగా ఇప్పటివరకూ బద్ధ శత్రువులుగా ఉన్న రెండు పార్టీలూ ఏకం కావాలన్న యోచనలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మెహబూబా ముఫ్తీ, తన సోషల్ మీడియా ఖాతాలో చేసిన నాలుగు ట్వీట్లను పావుగంట వ్యవధిలో ఒమర్ రీట్వీట్ చేయడం గమనార్హం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సుస్థిర పాలనను కశ్మీరీలకు అందించేందుకు తనకు ఒమర్ సాయం కావాలని ఆమె ట్వీట్ చేశారు.
ఆమె వరుస ట్వీట్లను తన అభిమానులతోనూ పంచుకున్న ఆయన, "మీతో ఏకీభవిస్తూ, మీ ట్వీట్లను రీట్వీట్ చేస్తానని ఎన్నడూ అనుకోలేదు. రాజకీయాలు నిజంగా ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. మీరు తలపెట్టిన యుద్ధంలో విజయం సాధించాలి" అని ఆయన అన్నారు.
కాగా, మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని పీడీపీకి 29 మంది ఎమ్మెల్యేలుండగా, ఒమర్ అబ్దుల్లా నేతగా ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ కు 15 మంది ఎమ్మెల్యేలున్నారు. వీరికి కాంగ్రెస్ కూడా తోడైతే, సులువుగా మ్యాజిక్ మార్క్ ను దాటేయవచ్చు. జమ్మూ కశ్మీర్ లో కాంగ్రెస్ పార్టీకి 12 మంది ఎమ్మెల్యేలున్న సంగతి తెలిసిందే.