New Delhi: ఢిల్లీలో విమానం ఎక్కాలంటే మరింత చెల్లించాల్సిందే... ఏడు రెట్లు పెరిగిన పాసింజర్ ఫీజు!
- ఇప్పటివరకూ యూడీఎఫ్ రూ. 10
- ఇకపై రూ. 77 చెల్లించాల్సిందే
- డిసెంబర్ 1 నుంచి అమలులోకి
డిసెంబర్ 1వ తేదీ నుంచి న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో పాసింజర్ చార్జీని పెంచుతున్నట్టు ఏఏఐ ప్రకటించింది. ఈ మేరకు గడచిన 19 తేదీతో ఎయిర్ పోర్ట్ ఎకనామిక్ రెగ్యులేటరీ అధారిటీ (ఏఈఆర్ఏ), ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు లిమిటెడ్ (డీఐఏఎల్) ఓ ప్రకటన వెలువరించాయి. ఇకపై విమానం ఎక్కే ఒక్కో దేశవాళీ పాసింజర్ పై రూ. 77 వసూలు చేస్తామని, అదే టికెట్ ను విదేశీ కరెన్సీలో కొనుగోలు చేసే వారు 1.93 డాలర్లు అదనంగా చెల్లించాల్సి వుంటుందని పేర్కొంది. ప్రస్తుతం యూజర్ డెవలప్ మెంట్ ఫీజు దేశవాళీ ప్రయాణికులపై రూ. 10గా, విదేశీ ప్రయాణికులపై రూ. 45గా ఉన్న సంగతి తెలిసిందే.
ఎయిర్ పోర్టు అవసరాలు, మరింత మెరుగైన సౌకర్యాల కల్పన కోసమే యూడీఎఫ్ చార్జీలను పెంచినట్టు డీఐఏఎల్ పేర్కొంది. కాగా, గత సంవత్సరం న్యూఢిల్లీ ఎయిర్ పోర్టు యూడీఎఫ్ ను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తగ్గించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా యూడీఎఫ్ ను ఏడు రెట్లకు పైగా పెంచడం గమనార్హం.