PMO: కేంద్ర మంత్రుల అవినీతిపై ఫిర్యాదులను వెల్లడించేది లేదు: కుండబద్దలు కొట్టిన ప్రధాని కార్యాలయం
- వివరాలు బయటకు వస్తే గందరగోళ పరిస్థితి
- గుర్తు తెలియని వారు ఆరోపిస్తుంటారు
- నిరూపించే ఆధారాలు అసలుండవు
- స.హ చట్టం కింద వచ్చిన ప్రశ్నకు జవాబు
కేంద్ర మంత్రులపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సంబంధించిన వివరాలను బహిర్గతం చేయలేమని ప్రధానమంత్రి కార్యాలయం కుండబద్దలు కొట్టింది. ఆయా వివరాలు బయటకు వెల్లడైతే గందరగోళ పరిస్థితి ఏర్పడుతుందని పీఎంఓ వ్యాఖ్యానించింది. సీబీఐ అధికారి ఒకరు కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయమంత్రి హరిభాయ్ పార్థీభాయ్ చౌదరిపై అవినీతి ఆరోపణలు చేసిన నేపథ్యంలో పీఎంఓ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
సమాచార హక్కు చట్టం కింద వచ్చిన ఓ ప్రశ్నకు పీఎంఓ సమాధానం ఇస్తూ, కేంద్ర మంత్రులపై అవినీతి ఫిర్యాదులు వస్తూనే ఉంటాయని, వాటన్నింటినీ బయటకు వెల్లడించడం సరైన చర్య కాదని అభిప్రాయపడింది. ఈ అవినీతి ఆరోపణలను గుర్తు తెలియని వారు కూడా చేస్తుంటారని, ఆరోపణలను నిరూపించే ఆధారాలు అసలుండవని, ఆరోపణల్లో నిజానిజాలు తేలకుండా వాటిని బయటపెట్టజాలమని స్పష్టం చేసింది.
కాగా, భారత ఫారెస్ట్ సర్వీస్ అధికారిగా పనిచేస్తూ, గతంలో ఎన్నో అవినీతి బాగోతాలను వెలుగులోకి తెచ్చిన సంజీవ్ చతుర్వేది పీఎంఓను ప్రశ్నించి, ఈ సమాధానాన్ని రాబట్టారు.