Andhra Pradesh: మోదీతో పొత్తు పెట్టుకుంటే పవన్, జగన్ కు డిపాజిట్లు దక్కవు!: మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
- ఇద్దరూ రాష్ట్రాన్ని తాకట్టుపెట్టారు
- అన్యాయంపై కేంద్రాన్ని ప్రశ్నించడం లేదు
- ఏపీ తరఫున పోరాడండి
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు సొంత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టుపెట్టారని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. సీఎం చంద్రబాబు కేంద్రంపై చేస్తున్న పోరాటాన్ని ముఖ్యమంత్రి కావాలన్న ఆకాంక్షతో జగన్ బలహీన పరుస్తున్నారని వ్యాఖ్యానించారు. తిత్లీ తుపాను పరిహారం, రాజధానికి నిధులు, పోలవరం నిర్మాణం సహా ఏ విషయంలోనూ కేంద్రం ఏపీకి సహకరించడం లేదని పుల్లారావు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లాలో తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
కేసుల మాఫీ కోసం జగన్, రాజకీయ ప్రయోజనాల కోసం పవన్ ప్రధాని మోదీని పన్నెత్తు మాట అనడం లేదని ప్రత్తిపాటి విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున కేంద్రంపై పోరాడాలని సూచించారు. మోదీతో పొత్తుపెట్టుకుంటే ఏపీలో పవన్, జగన్ లకు డిపాజిట్లు కూడా రావని జోస్యం చెప్పారు. ప్రత్యేకహోదా సహా విభజన హామీలను అమలు చేయని కేంద్రాన్ని ప్రశ్నించకుండా చంద్రబాబును లక్ష్యంగా చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు.