Congress: ప్రచారంలో జోరు పెంచిన కాంగ్రెస్.. తెలంగాణకు తొలిసారి సోనియా.. నేడు మేడ్చల్‌లో భారీ బహిరంగ సభ
- రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలిసారి రానున్న సోనియా
- రాష్ట్రం ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఘన సన్మానం
- కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం
ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ తెలంగాణలో కాంగ్రెస్ జోరు పెంచింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తొలిసారి సోనియాగాంధీ రాష్ట్రంలో అడుగుపెట్టబోతున్నారు. నేడు మేడ్చల్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో యూపీఏ చైర్ పర్సన్ సోనియా, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సహా పలువురు నేతలు పాల్గొననున్నారు. సోనియా దయ వల్లే రాష్ట్రం సిద్ధించిందని చెబుతూ వస్తున్న కాంగ్రెస్ నేతల్లో సోనియా రాక నూతనోత్సాహాన్ని నింపనుంది. అందరిలోనూ జోష్ కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేర్చినందుకు వేదికపైనే సోనియాను ఘనంగా సన్మానించాలని టీపీసీసీ నిర్ణయించింది.
ప్రత్యేక విమానంలో రాహుల్‌తో కలిసి సోనియా నేటి సాయంత్రం 5 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. 5:30 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 6 గంటలు సభాస్థలికి చేరుకుంటారు. సోనియా గాంధీ 45 నిమిషాలు, రాహుల్ 20 నిమిషాలు ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మేనిఫెస్టోను ఆవిష్కరించనున్నారు. కాగా, బహిరంగ సభ కోసం ఏర్పాటు చేసిన వేదికపై అభ్యర్థులు, కీలక నేతలు కలిపి 200 మంది ఆసీనులవుతారని కాంగ్రెస్ నేతలు తెలిపారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, టీజేఎస్ చీఫ్ కోదండరాం, బీసీ నేత ఆర్.కృష్ణయ్య, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తదితరులు కూడా సభలో పాల్గొంటారని సమాచారం.