CBI: మూడు రోజుల్లో లక్ష్మీ నారాయణ కొత్త పార్టీ... 26న స్వయంగా ప్రకటన!
- జెండా, అజెండాలను ప్రకటించనున్న సీబీఐ మాజీ జేడీ
- ఇప్పటికే ఏపీలో విస్తృతంగా పర్యటించిన లక్ష్మీ నారాయణ
- సొంతపార్టీ పెట్టేందుకే మొగ్గు
ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త రాజకీయ పార్టీ తెరపైకి రానుంది. ఇటీవల తన పదవిని వీడిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ, ఈ నెల 26న తన పార్టీ, జెండా, అజెండాలపై స్వయంగా ప్రకటన చేయనున్నారు. గత కొంతకాలంగా గ్రామాల్లో పర్యటిస్తున్న ఆయన, రైతుల కష్టాలపై అధ్యయనం చేశారు.
మహారాష్ట్ర క్యాడర్ నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఆయన, ఏపీలో విస్తృతంగా పర్యటించారు. అనేక కాలేజీలు సందర్శించి, విద్యార్థులతో మాట్లాడారు. సమస్యలపై ఓ రిపోర్టును తయారు చేసి, సీఎంకు నివేదిక కూడా ఇచ్చారు. ఆయన ఓ జాతీయ పార్టీలో చేరతారని ఊహాగానాలు వచ్చినా, సొంతపార్టీ వైపే ఆయన మొగ్గు చూపడం గమనార్హం.
కాగా, వైకాపా అధినేత వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుతో పాటు, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి కేసు, ఇండియాలో అతిపెద్ద సాఫ్ట్ వేర్ కుంభకోణంగా నిలిచిన సత్యం కంప్యూటర్స్ కేసులను లక్ష్మీ నారాయణ దర్యాఫ్తు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆయన ఈ కేసులను విచారించిన తీరు పెను సంచలనాన్నే సృష్టించింది. లక్ష్మీ నారాయణ పార్టీలో విద్య, ఆరోగ్య, వ్యవసాయ రంగాల్లో సంస్కరణలు ప్రధాన అజెండాగా ఉంటాయని తెలుస్తోంది.