Andhra Pradesh: అనంతలో ఆ ఐదు నియోజకవర్గాల్లో పరిస్థితి బాగోలేదు.. నేతలకు క్లాస్ పీకిన చంద్రబాబు!
- ఒక్కో నేతపై 200 పేజీల నివేదిక
- కార్యకర్తల ముందే ఎమ్మెల్యేలకు తలంటు
- పనిచేయకుంటే టికెట్లు దక్కవని హెచ్చరిక
2019 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అతివిశ్వాసంతో ముందుకు పోవద్దనీ, పంతాలు, పట్టింపులతో పార్టీని దెబ్బతీస్తే సహించబోనని హెచ్చరించారు. అనంతపురం జిల్లాలో పార్టీ పరిస్థితి, ఎన్నికల సన్నద్ధత, నేతల మధ్య గొడవలపై సీఎం నిన్న రాత్రి 2 గంటల వరకూ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ నేతలను బాబు సుతిమెత్తగా హెచ్చరించారు.
రాబోయే రోజుల్లో పనితీరు మెరుగుపరుచుకోకుంటే వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంటు టికెట్లు దక్కడం కష్టమేనని స్పష్టం చేశారు. కొన్నిచోట్ల ఎమ్మెల్యేల కుటుంబ సభ్యుల జోక్యంతో పార్టీకి చెడ్డపేరు వస్తోందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలను తక్కువ అంచనా వేస్తే నష్టపోతామన్నారు. అనంతపురంలో గుంతకల్, సింగనమల, కల్యాణదుర్గం, కదిరి, పుట్టపర్తిలో టీడీపీ ఎమ్మెల్యేలు బలహీనంగా ఉన్నారనీ, నియోజకవర్గంలో ప్రజలతో మమేకం కావాలని కోరారు.
ఈ ఐదు నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు పాలనను కుటుంబ సభ్యులకు అప్పగించేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఒక్కో నేతపై 200 పేజీల నివేదికను తెప్పించుకున్న బాబు, స్థానిక ఎమ్మెల్యేలను కార్యకర్తల ముందు కూర్చోపెట్టి క్లాస్ పీకారు. లోటుపాట్లను సరిదిద్దుకుని ముందుకు సాగాలని టీడీపీ ఎమ్మెల్యేలు, పార్లమెంటు సభ్యులకు దిశానిర్దేశం చేశారు.