Maharashtra: భార్య అశ్లీల చిత్రాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వేధింపులు.. భర్తను కటకటాల వెనక్కి నెట్టిన పోలీసులు!
- మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఘటన
- అత్యాచారం చేసి యువతిని పెళ్లాడిన కామాంధుడు
- కట్నం కోసం తీవ్ర వేధింపులు
ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ కామాంధుడు కేసు నుంచి తప్పించుకునేందుకు ఆమెను పెళ్లాడాడు. వివాహమయ్యాక కట్నం తీసుకురావాలని వేధించడం మొదలుపెట్టాడు. అయితే ఇందుకు యువతి ఒప్పుకోకపోవడంతో ఆమె అశ్లీల ఫొటోలను నెట్ లో పెట్టాడు. అంతటితో కసి తీరకపోవడంతో కిరోసిన్ పోసి నిప్పంటించేందుకు యత్నించాడు. చివరికి బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు, నిందితుడిని కటకటాల వెనక్కు నెట్టారు. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో చోటుచేసుకుంది.
ముంబైలోని కుర్లా ప్రాంతంలో కూలీగా పనిచేస్తున్న మైనర్ బాలిక(13)పై అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో యువతి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో బాధితురాలిని పెళ్లి చేసుకునేందుకు నిందితుడు ఒప్పుకున్నాడు. అయితే వివాహం అయ్యాక అత్తింటి నుంచి రూ.9 లక్షలు కట్నం తీసుకురావాలని వేధించడం మొదలుపెట్టాడు. అయితే అంతమొత్తం తన తల్లిదండ్రులు ఇచ్చుకోలేరని యువతి మొత్తుకుంది. అయినా వినకపోవడంతో తాను ఇంటికి వెళ్లబోనని కరాఖండిగా చెప్పేసింది.
ఈ నేపథ్యంలో ఆమెను అడ్డు తొలగించుకోవాలని భావించిన ప్రబుద్ధుడు తొలుత ఆమె ఫొటోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయినా భార్య నిర్ణయం మారకపోవడంతో కిరోసిన్ పోసి నిప్పంటించేందుకు యత్నించాడు. అతని బారి నుంచి ఎలాగోలా తప్పించుకున్న యువతి తల్లిదండ్రులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదుతో ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టు ముందు హాజరుపర్చి రిమాండ్ కు తరలించారు.