Chandrababu: సైకిల్ ను అమరావతికి పంపించాం.. ఇప్పుడు మళ్లీ వచ్చింది: హరీష్ రావు
- కాంగ్రెస్ ను అడ్డం పెట్టుకుని సైకిల్ మళ్లీ వచ్చింది
- తెలంగాణను అడ్డుకునేందుకు చివరి క్షణం వరకు చంద్రబాబు ప్రయత్నించారు
- కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. మళ్లీ విద్యుత్ సంక్షోభం వస్తుంది
సైకిల్ పార్టీ తెలంగాణవాళ్లది కాదనే దాన్ని అమరావతికి పంపించామని... ఇప్పుడు కాంగ్రెస్ ను అడ్డం పెట్టుకుని మళ్లీ వచ్చిందని మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణను అడ్డుకునేందుకు చంద్రబాబు చివరి క్షణం వరకు ప్రయత్నించారని... అందుకే ఆ పార్టీ తెలంగాణలో ఖాళీ అయిందని చెప్పారు. తెలంగాణకు రావాల్సిన సీలేరు ప్రాజెక్టును చంద్రబాబు గుంజుకున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కేంద్రానికి లేఖలు రాసిన చంద్రబాబుకు ఓటు వేస్తారా? అని ప్రజలను అడిగారు. మక్తల్ లో ఎన్నికల ప్రచారం సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్లీ విద్యుత్ సంక్షోభం వస్తుందని హరీష్ అన్నారు. అమ్మాయిల వివాహానికి రూ. 1,00,116 ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్సే అని చెప్పారు. గతంలో రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని... తాము ఎకరానికి రూ. 8వేలు ఇస్తున్నామని తెలిపారు. ప్రజల ఉత్సాహం చూస్తుంటే టీఆర్ఎస్ విజయం ఖాయమని తెలుస్తోందని అన్నారు.