EC: రవాణా వాహనాన్ని ప్రచారానికి వాడితే నియమావళి ఉల్లంఘనే!
- ప్రచార సామగ్రి తరలింపునకు మాత్రమే వినియోగించాలి
- వాహన సమాచారాన్ని ఎన్నికల కమిషన్కు అందించాలి
- వాహనం స్థితిగతులు తెలియజేయాలి
ఎన్నికల సమయంలో ఆయా పార్టీల అభ్యర్థుల కదలికలపై ఎన్నికల సంఘం డేగ కన్నుతో నిఘావేసి ఉంచుతుంది. అందువల్ల ఏ చిన్నపొరపాటు చేసినా అభ్యర్థులు పోటీకే అర్హత కోల్పోవచ్చు. ఉదాహరణకు ఎన్నికల ప్రచార సామగ్రి తరలింపునకు అనుమతించిన వాహనాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రచార కార్యక్రమాలకు ఏ రూపంలోనూ వినియోగించ కూడదు. తెలిసి వాడినా, తెలియకుండా వాడినా ఎన్నికల నియమావళి ఉల్లంఘించినట్టే.
ప్రతి రాజకీయ పార్టీ తన ప్రచార సామగ్రిని ఆయా నియోజకవర్గాలకు తరలించి తమ అభ్యర్థులకు అందించేందుకు వీలుగా 25 నియోజకవర్గాలకు ఒక రవాణా వాహనాన్ని ఎన్నికల కమిషన్ అనుమతిస్తుంది. ఈ వాహనం తాలూకా వివరాలు ముందుగానే ఈసీకి అందజేయాలి. వాహనం కండిషన్, ఇతరత్రా వివరాలు అందించాలి. కమిషన్ నుంచి అనుమతి లభించాక ఈ వాహనాన్ని కరపత్రాలు, జెండాలు, బ్యానర్లు...ఇలా ఎన్నికల కమిషన్ అనుమతిచ్చిన సామగ్రి దేన్నయినా రవాణా చేసుకోవచ్చు.