Laxminararana: లోక్‌సత్తా అధినేతగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. కొత్త పార్టీ ఏర్పాటు లేనట్టే?
- లక్ష్మీనారాయణ కొత్త పార్టీ లేనట్టే
- జేపీతో కలిసి ముందుకు
- నేడు అధికారిక ప్రకటన
కొత్త పార్టీని ప్రారంభించాలన్న ఆలోచన నుంచి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే జయప్రకాశ్ నారాయణ స్థాపించిన ‘లోక్‌సత్తా’ పార్టీకి త్వరలోనే లక్ష్మీనారాయణ అధ్యక్షుడు అవబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. నేడు హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లోని ప్రియదర్శిని హాల్లో జరగనున్న సమావేశం అనంతరం దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉందని చెబుతున్నారు.
లక్ష్మీనారాయణ తన ఉద్యోగం నుంచి స్వచ్ఛందంగా రిటైరైన తర్వాత ఏపీలో విస్తృతంగా పర్యటించారు. సమస్యలపై అధ్యయనం చేశారు. రాజకీయాల్లోకి రాబోతున్నట్టు ఇటీవల ప్రకటించారు కూడా. త్వరలోనే పార్టీ పేరును ప్రకటించబోతున్నట్టు తెలిపారు. ఇందుకోసం ‘జనధ్వని’ అనే పేరును కూడా అనుకున్నారు. అయితే, అకస్మాత్తుగా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు తెలుస్తోంది.
కొత్త పార్టీని ఏర్పాటు చేసి దానిని నడిపించడం కంటే ఉన్న పార్టీని మరింత బలోపేతం చేయడమే మేలని భావించిన ఆయన తనలాంటి భావజాలమే కలిగిన జయప్రకాశ్ నారాయణతో సంప్రదింపులు జరిపారు. ఈ నేపథ్యంలో లోక్‌సత్తా పార్టీకి అధ్యక్షుడిగా వ్యవహరించి పార్టీని బలోపేతం చేయాలని జయప్రకాశ్ కోరినట్టు సమాచారం. ఆయనకు సలహాలు సూచనలు ఇచ్చే బాధ్యతల్లో తాను వ్యవహరిస్తానని జేపీ చెప్పినట్టు సమాచారం.