ambati rambabu: వర్షాకాలంలో పుట్టే పుట్టగొడుగు లాంటిది జనసేన: అంబటి రాంబాబు
- చంద్రబాబును మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు ఒక గుంపు బయల్దేరింది
- ఆ గుంపులో పవన్ కూడా ఒకరు
- జగన్ ను విమర్శించే అర్హత పవన్ కు లేదు
వైసీపీ అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబును మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఒక గుంపు బయల్దేరిందని... ఆ గుంపులో పవన్ కల్యాణ్ కూడా ఒకరని విమర్శించారు. పార్టీని నడపలేక చేతులెత్తేసిన ప్రజారాజ్యంలో పవన్ కూడా భాగస్వామి కాదా? అని ప్రశ్నించారు. వర్షాకాలంలో పుట్టే పుట్టగొడుగు లాంటిది జనసేన పార్టీ అని ఎద్దేవా చేశారు.
నదుల అనుసంధానం పేరుతో చంద్రబాబు కొత్త నాటకం మొదలు పెట్టారని అంబటి విమర్శించారు. 2004 ఎన్నికల్లో దేవాదుల ప్రాజెక్టు అనుసంధానం పేరుతో హడావుడి చేశారని... ఇప్పుడు ఎన్నికలు వస్తున్న సందర్భంలో మళ్లీ అలాంటి హడావుడే చేస్తున్నారని మండిపడ్డారు. గోదావరి-పెన్నా అనుసంధానం పేరుతో కమిషన్లను దండుకోవడానికి సిద్ధమయ్యారని విమర్శించారు. ఇప్పటికే పట్టిసీమ నుంచి రాయలసీమ వరకు దోచేశారని అన్నారు.
చంద్రబాబు పాలనలో చోటుచేసుకున్న అవినీతి గురించి లోక్ సత్తా పార్టీ ప్రశ్నించడం లేదని అంబటి దుయ్యబట్టారు. తమ అధినేత జగన్ ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా... ఆయన ధైర్యంగా ఎదుర్కొన్నారని అన్నారు. జగన్ ను విమర్శించే స్థాయి పవన్ కల్యాణ్ కు లేదని చెప్పారు.