Telangana: 'మీరెంతో అదృష్టవంతులు'... అంటూ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించిన నరేంద్ర మోదీ!

  • బాసర సరస్వతీ దేవి కరుణ పొందిన గడ్డ
  • పవిత్ర గోదావరి నీటిని తాగుతున్నారు
  • యువశక్తిని గుర్తు చేస్తూ సాగిన ప్రధాని ప్రసంగం

పవిత్రమైన గోదావరి నీటిని తాగుతూ, ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర సరస్వతీ దేవి కరుణా కటాక్షాలను పొందిన ఈ ప్రాంత ప్రజలు ఎంతో అదృష్టవంతులని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం నాందేడ్ నుంచి నిజామాబాద్ కు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. ఆపై ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీజేపీ తరఫున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేశారు.

మండుతున్న ఎండల్లోనూ బీజేపీని ఆశీర్వదించేందుకు భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారని అన్నారు. నిజామాబాద్ యువశక్తిని ఈ సందర్భంగా తాను గుర్తు చేసుకుంటున్నానని చెబుతూ, ఇదే ప్రాంతానికి చెందిన గిరిజన బిడ్డలు మాలావత్, పూర్ణలు 13 ఏళ్ల ప్రాయంలోనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారని చెప్పారు. కామన్వెల్త్ పోటీల్లో పతకం సాధించిన మహమ్మద్ హుస్సేనుద్దీన్ ను కూడా మోదీ గుర్తు చేశారు.

ప్రస్తుతం దేశంలో 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయని, ఇప్పటివరకూ తాను నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లానని, ఇప్పుడు తెలంగాణకు వచ్చానని మోదీ అన్నారు. నేడు తాను ఐదో రాష్ట్రమైన తెలంగాణకు వస్తే, మిగతా రాష్ట్రాల్లో కనిపించిన ఉత్సాహమే కనిపించిందని అన్నారు. ఇక్కడి పాలకులకన్నా, ప్రజలకు బీజేపీపైనే విశ్వాసం ఉందని చెప్పారు. ఆయన ప్రసంగం కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News