Rahul Gandhi: మోదీకి ఎందుకు మద్దతిస్తున్నారని కేసీఆర్ ని నిలదీయండి: రాహుల్ గాంధీ
- తెలంగాణలో ఏర్పడిన మహాకూటమి దేశానికి దిక్సూచిగా పని చేయనుంది
- మోదీ మరోసారి ప్రధాని కావాలని టీఆర్ఎస్, ఎంఐఎంలు కోరుకుంటున్నాయి
- 22 లక్షల ఇళ్లు ఇస్తామని చెప్పిన కేసీఆర్.. 5వేల ఇళ్లను కూడా కట్టలేకపోయారు
తెలంగాణలో ఏర్పడిన ప్రజాకూటమి ఈ రాష్ట్రానికే పరిమితం కాదని... దేశానికి దిక్సూచిగా మారబోతోందని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తెలిపారు. మీ అందరి ఉత్సాహం చూస్తుంటే ప్రజాకూటమి అధికారంలోకి రావడం ఖాయమనిపిస్తోందని చెప్పారు. దేశంలోని కీలక వ్యవస్థలన్నింటినీ ఒకదాని తర్వాత మరొకదాన్ని ప్రధాని మోదీ నాశనం చేస్తూ వస్తున్నారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబం ఒకవైపు, యావత్ ప్రజలు మరొకవైపు ఉన్నారని చెప్పారు. తొలి విడతలో నరేంద్ర మోదీ బీ-టీమ్ అయిన టీఆర్ఎస్ ను ఓడిద్దామని... ఆ తర్వాత ఢిల్లీలో ఏ-టీమ్ బీజేపీని ఓడిద్దామని అన్నారు. ఖమ్మం సభలో మాట్లాడుతూ, రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
పార్లమెంటులో ప్రతి బిల్లు పాస్ కావడానికి మోదీకి కేసీఆర్ సహకరించారని రాహుల్ విమర్శించారు. అవిశ్వాస తీర్మానం, జీఎస్టీ అంశాల్లో కూడా మోదీకి మద్దతిచ్చారని చెప్పారు. టీఆర్ఎస్, ఎంఐఎంలు రెండూ మోదీ మరోసారి ప్రధాని కావాలని కోరుకుంటున్నాయని అన్నారు. నాలుగు పార్టీలతో కూడిన మహాకూటమి బీజేపీ, టీఆర్ఎస్ ను ఓడిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు, ఏపీకి పలు హామీలు ఇవ్వడం జరిగిందని... కానీ ఏ ఒక్క హామీని కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేక పోయిందని మండిపడ్డారు. ఇరు తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన విభజన హామీలన్నింటినీ నెరవేర్చాలని కాంగ్రెస్ కోరుకుంటోందని చెప్పారు. మోదీకి కేసీఆర్ మద్దతు పలుకుతున్నా... తెలంగాణ ప్రజలను మోదీ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. మోదీకి ఎందుకు మద్దతిస్తున్నారంటూ కేసీఆర్ ను నిలదీయాలని పిలుపునిచ్చారు.
కాళేశ్వరం పేరు మార్చి ప్రాజెక్టు అంచనాలను రూ. 40వేల కోట్లు పెంచేశారని రాహుల్ మండిపడ్డారు. రూ. 17 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని రూ. 2 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టేశారని విమర్శించారు. ప్రతి వ్యక్తిపై రూ. 60 వేల అప్పు ఉందని చెప్పారు. తెలంగాణ నిధులన్నీ కేసీఆర్ కుటుంబానికి, ఆయన స్నేహితుల జేబుల్లోకి వెళ్తున్నాయని ఆరోపించారు. లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కేసీఆర్... నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబానికి తప్ప మరెవరికీ ఉద్యోగాలు రాలేదని అన్నారు.
22 లక్షల ఇళ్లను ఇస్తామని చెప్పిన కేసీఆర్... 5వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కూడా కట్టలేకపోయారని విమర్శించారు. ప్రతి నిరుద్యోగికి రూ. 3వేల భృతి ఇస్తామని చెప్పారు. ప్రతి మండలంలో 30 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రతి పేద వ్యక్తి ఇల్లు కట్టుకోవడానికి రూ. 5 లక్షలు వారి అకౌంట్ లో వేస్తామని చెప్పారు. అందరం కలసి తెలంగాణలో టీఆర్ఎస్ ను ఓడించి... ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని అన్నారు.