Cricket: మిథాలీతో వేగడం చాలా కష్టం.. ఆమెతో నాకు సత్సంబంధాలు లేవు!: కోచ్ రమేశ్ పవార్

  • మిథాలీ స్ట్రెయిక్ రేట్ మెరుగ్గా లేదు
  • అందుకే జట్టు నుంచి తప్పించాల్సి వచ్చింది
  • బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రీకి వివరణ

భారత మహిళల జట్టు క్రికెట్ కోచ్ రమేశ్ పవార్ తనతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారని మాజీ కెప్టెన్ మిథాలీరాజ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇటీవల వెస్టిండీస్ లో ముగిసిన ప్రపంచకప్ సందర్భంగా మిథాలీకి సెమీఫైనల్ జట్టులో చోటు దక్కకపోవడం తెలిసిందే. దీనికి కోచ్ తో పాటు బీసీసీఐ పరిపాలన కమిటీకి చెందిన డయానా ఎలుడ్జీ కారణమని మిథాలీ ఆరోపించింది. తాజాగా ఈ వివాదంపై కోచ్ రమేశ్ పవార్ స్పందించారు.

బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రీతో భేటీ అయిన పవార్ మిథాలీని తప్పించడానికి గల కారణాలపై వివరణ ఇచ్చారు. ప్రపంచకప్ టోర్నీలో మిథాలీ స్ట్రెయిక్ రేట్ మెరుగ్గా లేకపోవడంతోనే ఆమెను పక్కన పెట్టామని తెలిపారు. మిథాలీతో వేగడం చాలా కష్టమైన పని అని విమర్శించారు. మిథాలీతో తనకు తొలి నుంచి సత్సంబంధాలు లేవని తేల్చిచెప్పారు.

కాగా, అంతకుముందు మిథాలీ మాట్లాడుతూ.. తన కెరీర్ ను నాశనం చేసేందుకు డయానా ఎలుడ్జీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. అంతేకాకుండా ఇందుకోసం ఎలుడ్జీ తన అధికారాన్ని వినియోగిస్తోందని విమర్శించింది. ఆమె అంటే తనకు చాలా గౌరవమనీ, అయినా డయానా ఎందుకు ఇలా చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదని వాపోయింది.

ఇతర మహిళా క్రికెటర్లు ప్రాక్టీస్ చేస్తుంటే పరిశీలించే కోచ్ రమేశ్ పవార్ తాను రాగానే అక్కడి నుంచి వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆయనతో మాట్లాడేందుకు తాను యత్నించినా, తననుంచి తప్పించుకుని తిరుగుతున్నారని మిథాలీ రాజ్ తెలిపింది.

  • Loading...

More Telugu News