Nalgonda District: నల్గొండలో కాంగ్రెస్‌కు షాక్... టీఆర్ఎస్లోకి ఇద్దరు కాంగ్రెస్ నాయకులు
- ఒకరు న్యాయవాది...మరొకరు మాజీ కౌన్సిలర్
- నేడు కేటీఆర్ సమక్షంలో కారెక్కనున్న ఇద్దరు నాయకులు
- ఫలించిన జగదీశ్ రెడ్డి మంతనాలు
ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో నల్గొండలో కాంగ్రెస్‌కు గట్టి షాక్ తగిలింది. పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు చేతిని వదిలి కారెక్కేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన వీరు గురువారం మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు.
జిల్లాకు చెందిన న్యాయవాది ధరణికోట రాము కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు. కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ ప్రతినిధిగా, యూత్‌కాంగ్రెస్ సభ్యుడిగా రాము పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించారు. దివంగత చకిలం శ్రీనివాసరావు అనుచరుడిగా పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. ప్రస్తుతం జిల్లా కాంగ్రెస్‌లో క్రియాశీలక పాత్ర పోషించడంతోపాటు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ప్రధాన అనుచరుడిగా కొనసాగుతున్నారు.
ఇక మరో నాయకుడు చిలక గోవర్థన్ మూడు సార్లు కౌన్సిలర్‌గా గెలుపొందారు. మంత్రి జగదీష్ రెడ్డి వీరిద్దరితో జరిపిన మంతనాలు ఫలించడంతో వీరు కారెక్కేందుకు సిద్ధమయ్యారని సమాచారం.